ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆగ్రహం..ఆందోళన ఉధృతం..జేఏసీ అల్టిమేటం
తెలంగాణాలో బస్సులు ఇబ్బడి ముబ్బడిగా తిరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 90 శాతం నడిపిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. రోజుకు ఆదాయం వచ్చి ఉంటుంది. మీ దగ్గర కార్మికులకు చెల్లించాల్సిన 49 కోట్లు లేవంటున్నారు. మరి వసూలైన డబ్బుల మాటేమిటి..అసలు ప్రభుత్వం ఇనీకెందుకున్నట్లు అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చలు జరపాలన్న సోయి సర్కారుకు లేనట్టుంది. ఓ వైపు ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మీరు ఈరోజు వరకు పూర్తి వివరాలు సమర్పించలేదు. అసలు ఏజీ ఎక్కడున్నారో తక్షణమే రమ్మనమని ఆదేశాలు జారీ చేసింది. అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు తాము వినదల్చు లేదని స్పష్టం చేసింది.
ఒక సమయంలో కోర్టు సీరియస్ అయ్యింది. సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టు నిలదీసింది. జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన 1475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన 1492 కోట్లతో పాటు ప్రభుత్వం నుంచి 2,300 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అందుకు హైకోర్టు అంగీకరించ లేదు. ఆర్టీసీకి నిధుల బకాయిలపై రేపటిలోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున వాదనలు వినిపించిన ప్రకాశ్ రెడ్డి.. కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశం మీద చర్చలు జరపాల్సిందేనని హైకోర్టుకు నివేదించారు. కార్మికుల 26 డిమాండ్లను కచ్చితంగా చర్చించాలని కోరారు.
అంశాలు మొత్తం న్యాయ పరమైనవేనని, వీటి వల్ల ఆర్ధిక భారం పడుతుందని ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని వివరించారు. కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఎండీని ప్రభుత్వం నియమించ లేదని, ఎండీ ఉంటే, కార్మికులు తమ సమస్యలను చెప్పుకునే వారని తెలిపారు. సమ్మె విషయంలో హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని ఎంఎన్‌యూ జాతీయ అధ్యక్షుడు మౌలాలా ఆరోపించారు. ఆర్టీసీకి బకాయిలపై 24 గంటల లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు. మరో వైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాత్రం సమ్మె కొనసాగి తీరుతుందని స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి