ఆ రూపం అపురూపం .. ఆ నటన అమోఘం

తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆమె రూపం . ఆమె నటన అమోఘం..అందుకే ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఏ పాత్రలో జీవించినా ఒదిగి పోయి నటించి, మెప్పించిన నటీమణి సావిత్రి. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో 1936 జన్మించారు ఆమె. 1981 లో కన్నుమూశారు. ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఓ రకంగా ఆమె లేకుండా సినిమాలు తీయలేని స్థితికి చేరుకున్నారు. అంతలా తన నటనతో వేలాది మంది అభిమానులను పొందిన ఘనత సావిత్రికి మాత్రమే దక్కింది. ఎన్నో జీవిత చరిత్రలు, లఘు చిత్రాలు , సినిమాలు కూడా ఆమె పేరుతో వచ్చాయి. ఇప్పటికి ఎప్పటికి ఆమెకు ఆమే సాటి .అంతలా తెలుగువారి హృదయాల్లో నిలిచి పోయారు. నటిగా , దర్శకురాలిగా పేరొందిన ఆమె జీవితం ఒడిడుకులు లోనైంది.

తెర మీద నటించినా జీవితంలో చాలా మంది ఫెయిల్ అయినా వాళ్ళు ఎందరో ఉన్నారు. మానసిక పరమైన అశాంతి , ఒంటరితనం సినిమా రంగాలలోని వారిని వెంటాడుతూనే ఉంటాయి. కావాల్సిందల్లా కాసింత ఓదార్పు .ఆమె అసలు పేరు నిశ్శంకర సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న ఆమెను పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగినఆమె తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే ప్రముఖ హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది.

తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలను అనుభవించి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది. ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులో నుండి తొలగింపబడింది.

ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించు కోవటానికి ఆమె, నృత్య రూపకుడు , దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.

ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరు తెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై 1981 డిసెంబర్ 26 న మరణించింది. ఆ రూపం లేక పోవచ్చు గాక ..కానీ ఆ నటన మాత్రం అజరామరంగానే మిగిలి పోతుంది.

కామెంట్‌లు