నటించి మెప్పించిన కాంచన

సినిమా అన్నది ఓ వ్యసనం . ఆడో అంతులేని రంగుల ప్రపంచం. కాదనలేం . కానీ దాని గురించి మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే అది సినిమా కనుక. వేలాది మంది ఈ రంగాన్ని నమ్ముకుని బతుకుతున్నారు . ఇంకొందరు తమకు ఎప్పుడు గెలుపు వరిస్తుందా అనుకుంటూ గడుపుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు . ఉంటారు కూడా .. ఎన్నో విషాదాలు అంతకంటే ఎక్కువగా విజయాలు నమోదు అయ్యాయి. ఈ రంగమే అంత. ప్రతిభ కలిగినా అవకాశాలు రాక నిరాశకు లోనే వాళ్ళు ఎందరో. అప్పట్లో ఛాన్సెస్ తక్కువ . కానీ ఇప్పుడు సీన్ మారింది. నీ టాలెంట్ నీకే స్వంతం. ఒక్కసారి క్లిక్ అయితే చాలు లైఫ్ ఇక బిందాస్.

ఇక ఆపాత మధురాలు విషయానికి వస్తే, కాంచన అసలు పేరు వసుంధరాదేవి. పాతకాలం నాటి సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది ఆమె. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఆమె చిన్న తనములోనే భరత నాట్యం , సంగీతంలో  శిక్షణ పొందారు . ఈ అనుభవం సినిమాలో ఎంటర్ అయ్యేందుకు దోహదపడ్డాయి . నటిగా రాణించడానికి మార్గం చూపాయి . ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారు మారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది.

1970  లో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారు బాట వేసింది. తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.

మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన 'గజ్జె పూజ'. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయంతో మథన పడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. ఇప్పటికీ ఎప్పటికీ కాంచన గుర్తుకు వస్తూనే ఉంటుంది. 

కామెంట్‌లు