ధ్యానం జీవ‌న యోగం..!

ఎవ‌రికి వారై ..ఎవ‌రి లోకంలో వాళ్లు ఊరేగుతూ అదే అద్భుత‌మనుకుంటూ బ‌తుకు జీవుల‌కు అన్నీ వున్నా ఏదో వెలితి కెలుకుతోంది. వ‌స్తువుల వ్యామోహం మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ త‌రుణంలో ప్ర‌శాంతత కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్ల‌కే ముస‌లిత‌నం వ‌చ్చేస్తోంది. చేతుల్లో సెల్లు గొల్లుమ‌నేలా క‌ట్ట‌డి చేస్తోంది. అటు శ‌రీరం..ఇటు మ‌న‌సు రెండింటి మ‌ధ్య ఈ లోకంలో మ‌న‌కంటూ ఓ ఐడెంటిటీ కావాలిగా.
దీని కోసం అంద‌మైన అబ‌ద్దాలు. లేనిపోని ఆడంబ‌రాలు. ఎంత నేర్చుకున్నా..త‌రాల‌కు స‌రిప‌డా సంపాదించినా సంతృప్తి శూన్యం. ఐదారుగంట‌లు కుదురుగా కూర్చోలేరు. ఒద్దిక‌గా వుండ‌లేరు. ప్ర‌పంచాన్ని ఉద్ద‌రించలేరు. పోనీ ఓ క్వింటాలు బ‌రువును ఎత్తలేరు. ఎందుకూ కొర‌గాని డిజిగ్నేష‌న్లు. ఎవ‌రిని క‌దిలించినా ఇంజ‌నీరింగ్ జ‌పం. ఇండియాను ఎప్పుడో మ‌ర్చిపోయారు.
24 గంట‌లు మొబైల్‌లోనే..అక్క‌డే ప్ర‌త్య‌క్షం..ప‌ల‌క‌రించేందుకు కూడా టైం దొర‌క‌ని దౌర్భాగ్య ప‌రిస్థితి. డాల‌ర్ల మాయాజాలం మ‌నుషుల్ని ఒక ప‌ట్టాన నిల‌వ‌నీయ‌కుండా చేస్తోంది. క‌ళ్లు చెదిరే నిర్మాణాలు..కాంక్రీట్ గ‌దుల్లో ఇరుక్కు పోయిన బ‌తుకులు. అంత‌టా బ‌ట‌న్ సిస్టం. బ‌తుకంతా అభ‌ద్ర‌త రాజ్యమేలుతోంది. ఎవ‌రి జింద‌గీ వారిదే. ఏ ఒక్క‌రికీ ప‌ర్మినెంట్ అడ్ర‌స్ అంటూ వుండ‌దు. ప‌ల‌క‌రిస్తే యుఎస్‌. పోనీ బేసిక్స్ రావు. ఎథిక్స్ ఎప్పుడో మ‌రిచి పోయారు. అల్లారు ముద్దుగా పెంచి ..అప్పులు చేసి చ‌దివించి పంపిస్తే..ఉన్న‌ట్టుండి ప్రాణం పోతే..ఫ్ల‌యిట్ దొర‌క‌దు..ఇక్క‌డ ఉంచ‌రు.
ఎవ‌రు ఏమైపోతే ఏం. మ‌నం బాగుండాలిగా..జ‌ర్నీ మేడ్ ఈజీ బాస్‌. ఎంత సంపాదిస్తే ఏం లాభం..అంద‌రికీ కావాల్సింది..ఆరడుగుల స్థ‌లం. క‌నెక్టివిటీ పెరిగాక‌..క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీతో అనుసంధానం జ‌రిగాక‌..మ‌నుషులు జీవ‌చ్ఛ‌వాలుగా మిగిలి పోయారు. ఎంజాయ్ చేసేందుకు ప‌వ‌ర్‌లేదు. పొద్ద‌స్త‌మానం ప్రాజెక్టు వ‌ర్క్‌ల్లో మునిగి తేల‌ట‌మేగా..ప్రేమించ‌లేరు. ప్రేమ‌ను పంచ‌నూ లేరు. ఒక‌ప్పుడు వ‌స్తువులు అవ‌స‌రానికి ఉప‌యోగ‌ప‌డేవి. ఇప్ప‌డ‌వి స్టేట‌స్ సింబ‌ల్స్‌గా మారాయి. త‌ప్పులు చేసినా ప‌ర్వాలేదు..అబ‌ద్ధాలు చెప్పినా ఓకే..కానీ డాల‌ర్స్ కావాలి. ఇండియాలో ఏముంది..అంతా అమెరికా జ‌ప‌మేగా..
పంచేంద్రియాలు ప‌నిచేయాలంటే ప్ర‌కృతి బాగుండాలిగా..వ్య‌వ‌సాయం సాగవ్వాలిగా..రైతులంటే ..భార‌తీయులంటేనే చుల‌క‌న‌. జ‌ర్నీ..జింద‌గీ రెండూ కాలంకంటే పోటీగా ప‌రుగులు తీస్తున్నాయి. సిగ్న‌ల్స్ మారిపోయాయి. లెక్క‌లేనంత బ్యాల‌న్స్ వున్నా..చెప్పుకోలేని రోగాల‌తో జ‌నం బెంబేలెత్తి పోతున్నారు. క‌ళ్లున్నాచూడ‌లేరు. లెన్స్ కావాలి. ఎక్కువ తింటే అర‌గ‌దు. ప‌ది కిలోమీట‌ర్లు న‌డ‌వ‌లేరు. వీళ్లు ఈ జాతిని ఎలా ఉద్ద‌రిస్తారు. ఏ ర‌కంగా ఎన్ ఆర్ ఐలు ఈ దేశ‌పు అభివృద్ధిలో పాలు పంచుకోగ‌ల‌రు. ఆనందం అంగట్లో దొరికే వ‌స్తువు కాదు. సంతోషం డాల‌ర్లు ఇవ్వ‌లేవు. మ‌నుషుల మ‌ధ్య బంధాలు నెర‌ప‌లేరు. వ‌త్తిళ్ల‌ను త‌ట్టుకోలేక ..త‌మ‌ను తాము అదుపులోఉంచుకోలేక ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే స్వాములు, ఆధ్యాత్మిక గురువులు, ట్రైన‌ర్స్‌, సాఫ్ట్‌స్కిల్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ కు డిమాండ్ ఉంటోంది. మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోనంత కాలం మ‌న జీవితాలు ఇలాగే ఏడుస్తూనే ఉంటాయి. శాంతి..సంతోషం..సంతృప్తి..ఆనందం ..హోదా..గుర్తింపు..మ‌న‌ల్ని మ‌నం అదుపులో ఉంచుకున్న‌ప్పుడే క‌లుగుతాయి.

వీటిని పొందాలంటే పైర‌వీలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇంకెవ్వ‌రినీ దేబ‌రించాల్సిన ప‌నిలేదు. జ‌స్ట్..మిమ్మ‌ల్ని మీరు గౌర‌వించుకోవ‌డం..గాఢంగా ప్రేమించు కోవ‌డం. శ్వాస మీద ధ్యాస కాదు కావాల్సింది. నీకు నీ మీద శ్ర‌ద్ధ కావాలి. అప్పుడే నీ మ‌న‌సేమిటో నీకు తెలుస్తుంది. నీవేమిటో అర్థ‌మ‌వుతుంది. ధ్యానం కావాలంటే దానం చేయాలి. ప‌ది మందికీ ప‌ట్టెడ‌న్నం పెట్టాలి. ప్ర‌జ‌ల‌తో..ప‌క్క‌వారితో బాగుండాలి. మాన‌వ స‌మూహంలో చేరాలి.
స‌మాజం కొత్త‌గా అగుపిస్తుంది. ప్ర‌కృతి తోడవుతుంది..ప్ర‌పంచ‌మే మ‌న‌ద‌వుతుంది. శ‌రీరం మ‌న మాట వినాలంటే..దానిని ప‌నిలోనే ఉంచాలి. అశాంతికి దూరంగా వుండాలంటే..ప్ర‌శాంతత ద‌గ్గ‌ర‌వ్వాలంటే మ‌న‌దైన లోకంలోకి మ‌నం జారుకోవాలి. అందులో పీక‌ల‌లోతు కూరుకు పోవాలి. అప్పుడు అస‌లైన ఆత్మ సంతృప్తి ద‌క్కుతుంది. ఆనందం ఆవిరి కాకుండా నీడ‌లా మ‌న వెంటే వుంటుంది..ఇదే యోగం..ఇదే జీవ‌న యానం..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!