బాబు..జగనా..పవనా..! ఏపీలో పవర్ పాలిటిక్స్..!
ఏపీలో రాజకీయాలు రాకెట్ కంటే వేగంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. తనదైన మార్క్‌తో ఇప్పటికే పవర్ ఫుల్ కార్యక్రమాలను చేపట్టారు. నైపుణ్యాభివృద్ధిలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారు. ఐటీ, రియల్ ఎస్టేట్, నిర్మాణ, పారిశ్రామిక, తదితర రంగాలన్నింటిలో ఏపీని పరుగులు పెట్టిస్తున్నారు. అటు రాయలసీమ, ఇటు ఆంధ్రాలో 90 శాతానికి పైగా అభ్యర్థులు గెలుపొందేలా ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. అన్ని నియోజకవర్గాలలో సర్వే సంస్థలతో అభిప్రాయాలను సేకరించారు. చాలా చోట్ల సిట్టింగ్‌లతో పాటు మరికొందరు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మిగతా పార్టీల నుండి పోటీ తీవ్రం కావడంతో ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. జీవిత కాలమంతా మిషన్‌లా పనిచేసే గుర్తింపు కలిగిన బాబు ..మరోసారి తనదైన ముద్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేలా కృషి చేశారు.
పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా..పెట్టుబడులు వెల్లువలా వచ్చేలా ..కృషి చేశారు. ఆయనకు తోడుగా తన మంత్రివర్గంలో ఉన్న వారిని పనిచేసేలా చూస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకునేలా..వాడుకునేలా..గ్రామాలకు..పట్టణాలకు విస్తరించేలా చేశారు. ఎక్కడికి వెళ్లినా..ఏడున్నా సరే అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు దేశాలలో పర్యటించారు. ప్రవాస ఆంధ్రులు, తెలుగు వారిని పెట్టుబడులు పెట్టేలా కోరారు. ఉపాధి కల్పించే రంగాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రతిపక్షాల నుండి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ మహిళలు, యువతీయువకులు, రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, డ్వాక్రా గ్రూపు సభ్యులను ఆయన టార్గెట్ చేశారు. వారందరికి ఏదో ఒకరకంగా లబ్ధి చేకూరేలా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో వైపు తన కుమారుడు నారా లోకేష్ బాబుకు కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖలను అప్పగించారు. ఐటీ పరంగా చాలా కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి.
విజయవాడ, అమరావతి, గన్నవరం, మంగళగిరి, గుంటూరు, విశాఖ పట్టణం, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలపై దృష్టి పెట్టారు. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎమ్మెల్యేల సీట్ల కోసం ఎడతెగని పోటీ నెలకొంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి చర్చకు తెర తీశారు. ఇంకో వైపు దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు ఏపీ సీఎం . తమిళనాడులో స్టాలిన్‌ను, కర్ణాటకలో దేవెగౌడ, కుమారస్వామి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని, యుపీలో అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్రలో శరద్ పవార్‌ను కలిశారు. పీఎం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇపుడు ఎన్నడూ లేనంతగా ఏపీలో ఓ వైపు వైఎస్పీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలు ముగ్గురికి అగ్నిపరీక్షకు గురి చేయనున్నాయి. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓ వైపు అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక ప్రభుత్వ వ్యతిరేకత విపక్షాలకు ఆయుధంగా మారుతుందా అన్నది తేలాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఏపీలో జగన్ పాదయాత్ర చేపట్టారు. బాబును జగన్ టార్గెట్ చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా బాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీ అవినీతికి కేరాఫ్ గా మారిందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మాత్రం వేచి చూసే ధోరణిని కనబరుస్తోంది. ఇంకో వైపు కాంగ్రెస్ తో టీడీపీ దోస్తీ కట్టడంతో ఏపీలో ఇరు పార్టీలు కలిసి పోటీలో ఉంటాయా లేక విడి విడిగా బరిలోకి దిగుతాయా అన్నది ఇరు పార్టీల అధినేతలు బాబు, రాహుల్ గాంధీలు నిర్ణయించారు. రెండు పార్టీలు కలిస్తే ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఒక్క శాతం ఓటు మారినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నది. ఏ క్షణంలోనైనా ..ఏ సమయంలోనైనా రాజకీయాలను మార్చగలిగే సత్తా కలిగిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది.
తెలంగాణలో ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించాలని కంకణం కట్టుకున్న బాబుకు ఇక్కడ ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. దీంతో కేసీఆర్ బాబును దెబ్బ తీయాలని కంకణం కట్టుకున్నారు. మరో వైపు మోడీతో దోస్తీ కొనసాగిస్తూనే ఎలాగైనా సరే టీడీపీకి చెక్ పెట్టాలన్నది గులాబీ బాస్ ఆలోచన. దానిలో భాగంగానే కేటీఆర్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం..ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని ఆహ్వానించడం జరిగింది. ఈ కీలక పరిణామం రాజకీయాల్లో సంచలనం కలిగించింది. ఏపీకి హోదా కల్పించేందుకు టీడీపీ ప్రయత్నించడం లేదంటూ చేసిన పవన్ కళ్యాణ్ విమర్శలను టీడీపీ పరిగణలోకి తీసుకుంది. ఏకంగా మోడీపై తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసింది. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని బాబు ఎద్దేవా చేశారు.
నిన్నటి దాకా స్నేహితులుగా ఉన్న బాబు, పవన్‌లు ఉన్నట్టుండి శత్రువులుగా మారారు. ఈమధ్య కొంత సానుకూల దోరణి కనిపిస్తోందని జనసేన అధినేత విషయంలో. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా లేక ఒంటరిగానే బరిలో నిలుస్తారో తెలియక ఆయా పార్టీలకు చెందిన వారు తలలు పట్టుకుంటున్నారు. మరొకరి ఆధిపత్యం కానీ..నాయకత్వం కానీ భరించే స్థితిలో ఇరు పార్టీల నేతలు జగన్, పవన్‌లకు ఇష్టం ఉండదు. దీంతో ఇద్దరూ కలిసే అవకాశం లేదు. మోడీకి కంట్లో నలుసులా తయారైన బాబును దెబ్బ కొట్టాలంటే ఇటు జగన్‌ను అటు పవన్‌ను మరో వైపు కేసీఆర్‌ను వాడు కోవాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పదవి తమదంటే తమదేనని కలలు కంటున్నారు. కానీ ఏపీ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది త్వరలో తేలనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి