సేవే మార్గం జీవితం ధ‌న్యం - మ‌హిళా స్ఫూర్తి - శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు

జీవితం దేవుడిచ్చిన వ‌రం. ప‌ది మందికి సేవ చేయ‌డంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ ఉండ‌దంటున్నారు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం జూప‌ల్లి గ్రామానికి చెందిన శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు. త‌రాల‌కు  స‌రిప‌డా ఆస్తులు, అంత‌స్తులున్నా అవేవీ మ‌న‌కు ఆనందాన్ని ఇవ్వ‌వ‌ని చెబుతారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన దాంట్లోంచి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలంటారు. ఒక మ‌హిళ త‌లుచుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఆమె నిరూపిస్తున్నారు. సాటి మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త‌ల్లిదండ్రులు ర‌ఘుప‌తిరావు, సౌంద‌ర్య‌దేవి. ఐదుగురు అక్కా చెల్లెళ్లు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. 1975లో క‌రీంన‌గర్ జిల్లాకు చెందిన శ్రీ‌మాన్ భాస్క‌ర్‌రావు గారితో వివాహం. వీరికి ఒక పాప‌. ఒక బాబు. ఇద్ద‌రూ చ‌దువులో రాణించారు. వైద్యులుగా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. కోడ‌లు , అల్లుడు కూడా డాక్ట‌ర్సే. 1980లో జి.వి.భాస్క‌ర్‌రావు పేరుతో సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. 1986లో దీనిని కావేరీ సీడ్స్ కంపెనీగా మార్చారు. ఇదే స‌మ‌యంలో శ్రీశ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అప్ప‌టి నుండి శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు మారిపోయారు. అటు గృహిణిగా ఇల్లును చ‌క్క‌బెడుతూనే భ‌ర్త‌కు పూర్తి స‌హ‌కారం అందించారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగేందుకు ఆమె దోహ‌ద‌పడ్డారు. అటు పిల్ల‌లు ఆశించిన స్థాయిలో ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ‌టంతో ఆమె కంపెనీ వ్య‌వ‌హారాలు చూస్తూనే సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. వికాస త‌రంగిణిని సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. అక్క‌డి నుంచి ఆమె వెనుతిరిగి చూడ‌లేదు. ప్ర‌జ‌ల‌కు, భ‌క్త‌జ‌నుల‌కు ఉప‌యోప‌డే ప‌నులు ద‌గ్గ‌రుండి చేప‌ట్టారు. మ‌హిళ‌ల‌ను చైత‌న్య‌వంతం చేశారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకునేలా వారిని తీర్చిదిద్దారు. అంతేకాకుండా నేరాల‌కు పాల్ప‌డి శిక్ష‌ను అనుభ‌విస్తున్న ఖైదీల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. వారు పూజ‌లు, దీక్ష‌లు చేప‌ట్టేలా కృషి చేశారు. ఇంకొక‌రైతే భ‌య‌ప‌డ‌తారు కానీ ఆమె మాత్రం వారూ మ‌న‌లాంటి మ‌నుషులేన‌ని గుర్తించారు. తెలిసో తెలియ‌కో త‌ప్పులు చేసినంత మాత్రాన వారిని సేవ‌లో భాగం ఎందుకు చేయ‌కూడ‌దంటూ ప్ర‌య‌త్నం చేశారు. ఆమె కృషి ఫ‌లించింది. అది నేడు ఎంద‌రో ఖైదీలు మారేలా చేసింది. ఇదంతా శ్రీ స్వామి వారి చ‌ల‌వేనంటారు ఆమె. 

హ‌త్యల‌కు పాల్ప‌డిన వాళ్లు, శిక్ష‌ను అనుభ‌విస్తున్న వాళ్లు భ‌క్తులుగా మారి పోతున్నారు. సామాజిక సేవ‌ల్లో భాగం పంచుకుంటున్నారు. తెలిసో తెలియ‌కో అనుకోకుండా జ‌రిగిన త‌ప్పుల‌కు కొంద‌రు శిక్ష అనుభ‌విస్తుంటే మ‌రికొంద‌రు ఖైదీలుగా చీక‌టి గ‌దుల్లోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు. అలాంటి క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్తులు సైతం ఇపుడు జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ అంటూ ప‌లుకుతున్నారు. త‌మ‌లో ఆధ్యాత్మిక భావ‌న అనే దీపాన్ని వెలిగించిన శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు గారిని అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. ఇదంతా భ‌క్తిత‌త్వంతో స్వామి వారిని సేవిస్తూ నేర‌స్తుల‌ను సైతం మ‌నుషులుగా మార్చేసేందుకు ఆమె చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు క‌ళ్ల ముందు క‌నిపిస్తాయి.  కారాగారాల్లో శిక్ష అనుభ‌విస్తున్న వారిలో భ‌ట్టు వెంక‌న్న‌, శ‌ర్మ‌లు, ముర‌ళీధ‌ర్‌రెడ్డిలు మేడం చేసిన కృషితో పూర్తిగా మారిపోయారు. విడుద‌లై హాయిగా ప‌నులు చేసుకుంటూ బ‌తుకుతున్నారు. వెంక‌న్న మంచి ర‌చ‌యిత‌. వేల పాట‌లు రాశాడు. ఇందులో వేయికి పైగా పాట‌ల్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి మీద రాస్తే మ‌రికొన్ని పాట‌ల్ని హృద‌యాన్ని హ‌త్తుకునేలా శ్రీ స్వామి వారి మీద రాసారు. జైలు నుంచి విడుద‌ల‌య్యాక ఆశ్ర‌మంలో సెక్యూరిటీ విభాగంలో ప‌నిచేశారు. అత‌డి ప‌నితీరును గుర్తించిన శ్రీ‌మ‌తి వ‌న‌జ గారు స్వంతంగా పాట‌ల‌తో కూడిన పుస్త‌కాన్ని ప్ర‌చురించారు.  స్వామి వారిని భ‌క్తితో స్మ‌రించు కోవ‌డం, దీక్ష చేప‌ట్ట‌డం, మేడం స‌హ‌కారంతో మారిపోయామంటారు వీరంతా. ఇక  ఇద్ద‌రు శ‌ర్మ‌లు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకున్నారు. స‌మాజానికి దూరంగా , లోలోప‌ట చేసిన నేరానికి కుమిలి పోతున్న వీరిలో ఆమె ధైర్యం చెప్పింది. కారాగార అధికారుల‌తో మాట్లాడి వారు వికాస త‌రంగిణిలో పాలు పంచుకునేలా చేశారు. జైలు గ‌దుల్లో పూజాది కార్య‌క్ర‌మాలు , దీక్ష‌లు నిర్వ‌హించేలా చేశారు. స్వామి వారి కృప‌తో వారు భ‌క్తులుగా మారిపోయారు. ముర‌ళీధ‌ర్‌రెడ్డి సైతం ఇదే బాట‌లో న‌డుస్తూ స్వంతంగా ప‌నులు చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు. మిగ‌తా ఖైదీల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. దాదాపు కొన్నేళ్లుగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మం నేటికీ నిరాటంకంగా కొన‌సాగుతూనే వుంది. నేరాలు చేసిన చేతులు , దూషించిన పెదవులు ఇపుడు శ్లోకాలు వ‌ల్లె వేస్తున్నాయి.  ఇదంతా శ్రీ స్వామి వారు అనుగ్ర‌హం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని అంటారు వారంతా.  ప్ర‌తి ఏటా 186 మందికి పైగా ఖైదీలు విడుద‌ల‌వుతున్నారు. త‌మ‌ను తాము మార్చుకుంటూ ...మేడం సూచ‌న‌లు పాటిస్తూ , శ్రీ స్వామి వారు చూపిన బాట‌లో న‌డుస్తూ మామూలు మ‌నుషులుగా స‌మాజంలో భాగ‌మ‌వుతున్నారు. శ్రీ వేంక‌టేశాయ న‌మః అంటూ 19 ల‌క్ష‌ల సార్లు ఖైదీలు రాయ‌డం విశేషం. 

శ్రీ స్వామి వారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన మంగ‌ళ త‌రంగిణి కార్య‌క్ర‌మాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో స‌క్సెస్ చేశారు. భారీ వ‌ర్షం ప‌డుతున్నా లెక్క చేయ‌కుండా ఆమె తిరిగారు. ల‌క్ష మందితో శ్రీ స్వామి వారు చేప‌ట్టిన గీతాజ్యోతి కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. ఇదంతా శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు కృషేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కార్గిల్‌లో అమ‌రులైన వారి కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం చేశారు. క‌ర్ణాట‌కలోని బ‌ళ్లారిలో స్వామి వారి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆచార్య సేవా యాత్ర‌ను చేప‌ట్టారు. 2000లో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన వికాస త‌రంగ‌ణికి ఆమె అధ్య‌క్షురాలిగా ఉన్నారు. పిల్ల‌ల‌కు క్యాంప్స్ నిర్వ‌హించ‌డం, ఆట‌, పాట‌లు, డ్రాయింగ్ కాంపిటీష‌న్స్ నిర్వ‌హించారు. 2వ త‌రగ‌తి నుండి ఇంట‌ర్ దాకా విద్యార్థినీ విద్యార్థుల‌కు ఈ క్యాంప్స్ చేప‌ట్టారు. వైద్య‌, ఆరోగ్య శిబిరాలు వేలాదిగా చేప‌ట్టారు. దంత‌, నేత్ర చికిత్స‌, జ‌న‌ర‌ల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. న‌గ‌రం చుట్టూ ఉన్న వంద‌లాది గ్రామాల్లో ప‌ర్య‌టించి వైద్య శిబిరాలు నిర్వ‌హించి అవ‌గాహ‌న క‌ల్పించారు. చేవెళ్ల‌లోని కాలేజీలు, స్కూల్స్ పిల్ల‌ల‌కు బ్ల‌డ్ క్యాంపులు చేప‌ట్టారు. వేయి కాళ్ల మండ‌పం క‌ట్టాల‌నే శ్రీ స్వామి వారి సంక‌ల్పానికి మ‌ద్ధ‌తుగా ల‌క్ష మంది భ‌క్తుల‌తో సంత‌కాలు చేయించిన ఘ‌న‌త శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు గారిదే. 2005లో చ‌ర్ల‌ప‌ల్లి కారాగారాన్ని ఆమె ఒక్క‌రే సంద‌ర్శించారు. 2000 మందికి శ్రీ స్వామి వారి తిరున‌క్ష‌త్రం సంద‌ర్భంగా పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి ఏటా కొన‌సాగుతూ వ‌స్తూనే వుంది. స్వంతంగా వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తూ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం అయ్యేలా చేస్తున్నారు. ఖైదీలు సైతం ప‌నులు చేసేలా, మాన‌వ‌తా దృక్ఫథాన్ని అల‌వ‌ర్చుకునేలా వారిని మార్చ‌గ‌లిగారు. వారి ప్ర‌వ‌ర్త‌న‌లో ..మాట తీరులో మార్పు వ‌చ్చేలా చేశారు. ఖైదీల పిల్ల‌లు చ‌దువుకునేలా ప్రోత్స‌హించారు. వారి భార్య‌లు త‌మ కాళ్ల‌మీద తాము నిల‌బ‌డేందుకు కుట్టు మిష‌న్ల‌ను ఉచితంగా శ్రీ స్వామి వారి చేతుల మీదుగా అంద‌జేశారు. ఖైదీల కోసం ప్ర‌త్యేకంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర శ‌ర‌ణాగ‌తి దీక్ష చేప‌ట్టేలా శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు ప్ర‌య‌త్నం చేశారు. 200 మంది ఖైదీలు ఈ దీక్ష‌ను చేప‌ట్టారు. వీరికి దుస్తులు, పూజా సామాగ్రి అంతా ఆమె అంద‌జేశారు. దీక్షా స‌మ‌యంలో వారు పూజ‌లు చేసుకునేలా, ఫ‌ల‌హారం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన ఉన్న‌తాధికారులు ఖైదీల్లో వ‌చ్చిన మార్పును చూసి ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఇంత‌లా మార్పు తీసుకువ‌చ్చిన శ్రీ‌మ‌తి వ‌న‌జ గారిని అభినందించారు. చ‌ర్ల‌ప‌ల్లిలో చేసిన ఈ ప్ర‌యోగం మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంతో రాజ‌మండ్రి, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్ జిల్లాల ఖైదీల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. జైళ్ల శాఖ ఐజీ సింగ్ ఇచ్చిన స‌హ‌కారం మ‌రిచి పోలేనిదంటారు ఆమె. దీక్ష‌లు చేపట్ట‌డం, త‌ప్పులు చేయ‌కుండా ఉండ‌టం, త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా ప‌నుల‌లో పాల్గొనేలా చేశారు. అత్త‌గారి ఊరైన గ‌ల్ల‌న‌ర‌సింగాపురంతో పాటు స‌మీప గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునేలా చేశారు.

అక్క‌డ వాట‌ర్ ప్లాంట్‌తో పాటు స్కూల్ భ‌వ‌నాల‌ను క‌ట్టించి ఇచ్చారు. చ‌దువు చెప్పే టీచ‌ర్ల‌కు జీతాలు కూడా ఇస్తున్నారు. పిల్ల‌లు చ‌దువుకునేందుకు వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తూనే పాఠ్య‌, నోటు పుస్త‌కాలు ఉచితంగా అంద‌జేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సును ఏర్పాటు చేశారు. ఊరులో సీతారాముల విగ్ర‌హ పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. 2000 మందితో కావేరీ సీడ్స్ కంపెనీ దేశ‌మంత‌టా విస్త‌రించింది. విదేశాల్లో సైతం త‌న బ్రాండ్‌ను నిల‌బెట్టుకుంది. తుపానులో స‌ర్వం కోల్పోయిన రైతుల కోసం 50 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే విత్త‌నాల‌ను ఉచితంగా అంద‌జేసింది. భ‌ర్త శ్రీ‌మాన్ భాస్క‌ర్‌రావు స‌హ‌కారం లేక‌పోతే తాను ఇన్ని కార్య‌క్ర‌మాలు చేయ‌లేన‌ని అంటారు శ్రీ‌మ‌తి వ‌న‌జ గారు. శ్రీ స్వామి వారి కృప వ‌ల్ల నేటికీ రెట్టింపు ఉత్సాహంతో చేప‌ట్టే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌గ‌లుగుతున్నాన‌ని అంటోంది. ఆమె చేసిన సేవ‌ల‌కు ఎన్నో పుర‌స్కారాలు అందుకున్నారు. ల‌లితా క‌ళా తోర‌ణంలో సేవా ర‌త్న అవార్డుతో పాటు మ‌ద‌ర్ థెరిస్సా , సేవ , ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ అవార్డులు అందుకున్నారు. దేవుడు మ‌న‌కు ఎంతో కొంత ఇస్తూనే ఉంటాడు. సాటి వారికి చేత‌నైనంత సాయం చేయ‌గ‌లిగితే ఆ తృప్తే వేరు. భ‌క్తి భావ‌న‌ను పెంపొందించు కోవాలి. త‌ల్లిదండ్రుల ఆశ‌ల్ని నిజం చేయాలి. ప‌ది మందికి తోడ్పాటు అందించ‌గ‌ల‌గాలి. అదే మ‌న‌ను ర‌క్షిస్తుంది. ప్ర‌శాంతంగా ఉండేలా చేస్తోంది అంటారు శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు. సేవే ధ‌ర్మంగా సాగుతూ ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్నారు ఆమె. రాబోయే రోజుల్లో మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాల‌తో పుర‌స్కారాలు అందుకోవాల‌ని ఆశిద్దాం.

కామెంట్‌లు