జీవన యానం..చంద్ర హాసం
జీవితంలో అత్యున్నతమైన వృత్తి ఏదన్నా ఉందంటే అది జర్నలిజం. ఒక్కసారి అందులోకి ఎంటరైతే చచ్చేంత దాకా అందులోనే. రాయడం, చదవడం, పరిశీలించడం, సమాజాన్ని, బతుకుని ఆవిష్కరించడం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే సాధ్యం. తెలుగు ప్రచురణ, ప్రసార మాధ్యమాల్లో మొదటి శ్రేణి సంపాదకులలో సతీష్ చందర్ ఒకరు. అయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి అక్షరంతో అంతరిక్ష ప్రయోగం అనే ట్యాగ్ లైన్ తో వార్త దినపత్రిక సంచలనం సృష్టించింది. ఇరవై ఏళ్ళ కిందటితో..ఇప్పటితో పోలిస్తే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతగా అంటే ఊహించలేనంత. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చాక లక్షలాది మందికి స్కోప్ ఏర్పడింది. లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇదే సమయంలో పాత్రికేయ విలువలకు కట్టుబడి బతుకు ప్రయాణం చేస్తున్న లబ్దప్రతిష్ఠులైన సంపాదకుల వద్ద పని చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. జగమెరిగిన జర్నలిస్టులైన వాళ్ళు, ఎడిటర్స్ ఎబికె ప్రసాద్, సతీష్ చందర్, రామచంద్ర మూర్తి, కె.శ్రీనివాస్, మురళిలతో పాటు న్యూస్ ఎడిటర్స్ లక్ష్మణ్ రావు, వేణుగోపాల్, నాంచారయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తారసపడ్డారు. వారితో ఎంతో నేర్చుకున్నా. నన్ను నేను మార్చుకున్నా. సాహిత్యాన్ని చదవడం, కవిత్వాన్ని రాయడం మరింత పెరిగింది. వృత్తి పరమైన వత్తిళ్లు ఉన్నా చదవకుండా, రాయకుండా ఉండలేని స్థితికి చేరుకున్నా. ఇదంతా ఎబికె, సతీష్ చందర్, శ్రీనివాస్ గార్ల నుంచి అబ్బింది. ఏదో సాధించాలన్న కోరిక నన్ను జర్నలిజం వైపు మళ్లేలా చేసింది. ఇప్పుడు ఉన్నంత వెసలుబాటు అప్పుడు లేదు.
ఎన్నో ఇబ్బందులు, యాజమాన్యపు వత్తిడి, ఆర్ధిక పరమైన కష్టాలు వెరసి సమస్యలను గుర్తించి ప్రత్యేక కథనాలుగా మలిచేందుకు నానా ఇబ్బందులు పడ్డాం. ఇదంతా వృత్తిలో భాగం. ఉదయం నుంచి రాత్రి దాకా వార్తల్లోనే ఉండే వాళ్ళం. ఆ రోజులు తలుచుకునే సరికల్లా ఇప్పటికీ హృదయం సంతోషానికి లోనవుతుంది. వార్తలో తరగతులు అంటేనే ఓ చైతన్యం ప్రవహించేది. గురువులు ఎబికె, సతీష్, కేఎస్ లు ఎప్పుడు వస్తారా అని ఆత్రుతతో ఎదురు చూసే వాళ్ళం. సమస్త ప్రపంచం..సమాచారం మా ముంగిట్లో వాలి పోయేది. అంతలా కనెక్ట్ అయ్యాం. ఇప్పటికీ అదే స్పార్క్ ఇంకా గుండెల్లో రాజుకుంటూనే ఉంటోంది. ఒరే అబ్బాయ్, ఎలా ఉన్నావ్, నిబద్దతతో ఉండు. గతి తప్పితే వృత్తికి న్యాయం చేయలేవు. విలువలే ముఖ్యం. వత్తిళ్లు లేకపోతే, సవాళ్ళను స్వీకరించ లేకపోతే జర్నలిస్టులు ఎలా అవుతారంటూ గురువు సతీష్ చందర్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి.
అర్ధరాత్రి ఈ మాటలు సార్ నోటి వెంట వచ్చాయి. ఏళ్ళు గడిచినా వీళ్ళందరూ తమ దారుల్లో అక్షరాలతో సమాజ చైతన్యం కోసం, జన హితం కోసం నిలబడ్డారు. ప్రజా వాక్కుకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ప్రముఖ నటి సిల్క్ స్మిత ఆత్మ హత్య చేసుకుంది. అందరూ వార్తలు మాత్రమే ఇచ్చారు. కానీ ఆమెకు కన్నీళ్లు అంటూ ఉండవా అంటూ సతీష్ చందర్ సార్ ..ఏకంగా ఓ సంపాదకీయమే రాశారు. మనుషుల పట్ల ఉన్న నిబద్దత తెలియ చేస్తుంది. బాబు హయాంలో రైతులపై జరిగిన కాల్పుల సంఘటనపై రాసిన ఎడిటోరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది రాసినా అది జనం కోసమే అయి ఉంటుంది. వ్యంగ్యం అన్నది ప్రతి రాసే సందర్భంలో అగుపిస్తూ ఉంటుంది. జర్నలిస్టు గా, సంపాదకుడిగా, అనలిస్ట్ గా, కవిగా, రచయితగా ఎన్నో రంగాలలో ఆయన అనుభవం గడించారు.
అంతే కాకుండా సమాజానికి మెరికల్లాంటి జర్నలిస్టులను తయారు చేసే పనిలో పడ్డారు. వీరి కోసం జర్నలిజం కోర్సులతో సంస్థను నడిపిస్తున్నారు. అంతే కాకుండా గురువు గారు రాసిన ఎన్నో సంపాదకీయాలు ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచాయి. ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ గా, వార్త అసోసియేట్ ఎడిటర్ గా, వార్త ఇంటర్నెట్ ఎడిషన్ ఎడిటర్ గా పని చేశారు. తెలుగు వాకిట సంచలనం రేపిన సుప్రభాతం వార పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. అంతకు ముందు ఆంధ్ర భూమి పత్రికకు చీఫ్ రిపోర్ట్రర్ గా పని చేశారు. గ్రేట్ ఆంధ్ర ఫిలిం అండ్ పొలిటికల్ వీక్లి కి ఎడిటర్ గా ఉన్నారు. 2006 లో ప్రజా పేరుతో డైలీ పేపర్ స్టార్ట్ చేశారు. కింగ్ మేకర్ జోకర్ పక్ష పత్రిక ను నడిపారు. ఇప్పటి దాకా 21 కి పైగా పుస్తకాలు రాశారు. సంపాదకీయాలపై మూడు పుస్తకాలు విడుదల చేశారు. పలు టీవీ ఛానల్స్ లలో హోస్ట్ గా, అనలిస్ట్ గా ఉన్నారు. పంచమ వేదం, నాన్న సైకిల్, పసుపు జాబిల్లి, ఆది పర్వం, పద చిత్రం పాపులర్ అయ్యాయి.
దళిత, తెలుగు సాహిత్యంలో సతీష్ చందర్ రాసిన పంచమ వేదం ఓ సంచలనంగా పేర్కొన్నారు ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, కళా రంగాలలో ఆయనకు అపారమైన అనుభవం ఉన్నది. ది ఫిఫ్త్ వేద పేరుతో కేరళకు చెందిన సెయింట్ బేర్చిమాన్స్ కాలేజీ ఇంగ్లిష్ లిటరేచర్ సిలబస్ లో చేర్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పంచమ వేదం, ఆది పర్వం పై ఎంఫిల్, పిహెచ్ డి చేశారు స్టూడెంట్స్. ఆంధ్ర యూనివర్సిటీ లోని తెలుగు సాహిత్యంలో పంచమ వేదం ను చేర్చారు. తానా ఎంపిక చేసిన అత్యుత్తమమైన 100 తెలుగు పుస్తకాల్లో పంచమ వేదం ను కూడా చేర్చింది.
మేడ్ ఇన్ ఇండియా, ఇతిహాసం, వాలు చూపులూ, మూతి విరుపులూ, దరువు, చంద్రహాసం పేరుతో వ్యంగ్యాత్మకంగా రాశారు సతీష్ చందర్. చాలా దిన, వార పత్రికల్లో పలు అంశాలపై వ్యాసాలు, కథనాలు రాస్తూనే ఉన్నారు. కథా రచయితగా ఆయనకు ఎంతో పేరుంది. 1995 లో వార్త లో జర్నలిస్టుల కోసం పలుకుబడి ని రూపొందించారు ఎబికెతో కలిసి. పొలిటికల్ లీడర్స్ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. 200 మందిని జర్నలిస్టులుగా ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేశారు. సర్వేలు కూడా చేపట్టారు. అవి ఎంతో పాపులర్ అయ్యాయి. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు సతీష్ చందర్. జర్నలిజంలో నూతన ఒరవడి కొనసాగిస్తూనే జనం కోసం తన కలాన్ని జులిపించినందుకు గాను కందుకూరి వీరేశలింగం అవార్డు అందుకున్నారు.
గంధం సీతారామాంజనేయులు పురస్కారాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తో పాటు పంచమ వేదం తరపున పొందారు. ఫ్రీ వర్స్ అవార్డు , పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పురస్కారం అందుకున్నారు. గజ్జెల మల్లారెడ్డి అవార్డు జర్నలిజం, సాహిత్యంలో విశిష్ట సేవలు అందించినందుకు లభించింది. అంబెడ్కర్ ఇంటర్ నేషనల్ మిషన్ అవార్డు పొందారు. ప్రసన్న అవార్డు తో పాటు డాక్టర్ పరుచూరి రాజారామ్ లిటరరీ అవార్డు, తాపీ ధర్మారావు పురస్కారం, పతంజలి అవార్డు తో సతీష్ చందర్ ను సన్మానించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఓ రకంగా లబ్దప్రతిస్థులైన జర్నలిస్టులు, సంపాదకులలో సతీష్ చందర్ అత్యున్నతమైన శ్రేణికి చెందిన జగమెరిగిన జర్నలిస్టు. ఎడిటర్. మాలాంటి వారికి..రాబోయే తరాలకు ఆయన ఓ దిక్సూచి కూడా. గురువు గారు మీరిలాగే ఉండాలి. రాస్తూనే ఉండాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి