ప్లీజ్ ఎఫ్‌డీఐకి పర్మిషనివ్వండి

ఇండియన్ టెలికాం కంపెనీల్లో టాప్ కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ కంపెనీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఉన్నట్టుండి రిలయన్స్ జియో కొట్టిన దెబ్బకు వృద్ధి రేటులో వెనుకబడి పోయింది. దీంతో ఉద్దీపన చర్యలు చేపట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్‌గా ఉన్న భారతీ టెలికాం 4,900 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి   ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ఇండియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సొమ్ము సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్‌, ఇతర విదేశీ కంపెనీల నుంచి రానుంది. ఒకవేళ అనుమతి లభించి పెట్టుబడులు పొందితే ఈ టెలికాం కంపెనీ విదేశీ కంపెనీగా మారనుంది. ఎఫ్‌డీఐ ద్వారా నిధులు వస్తే భారతీ టెలికాంలో విదేశీ షేర్‌ హోల్డింగ్‌ 50 శాతం దాటు తుందని, అప్పుడు విదేశీ కంపెనీగా మారడానికి అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

4,900 కోట్ల నిధుల రాక కోసం భారతీ టెలికాం దరఖాస్తు చేసుకుంది. ఇందులో సింగ్‌టెల్‌తో పాటు ఇతర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి కూడా ఉంది. ఈ పెట్టుబడులతో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పెరిగి భారతీ టెలికాం విదేశీ కంపెనీగా మారుతుంది. ఈ నెలలోనే టెలికాం విభాగం ఈ పెట్టుబడికి అనుమతిచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతీ టెలికాంలో సునిల్‌ భారతీ మిట్టల్‌, ఆయన కుటుంబానికి దాదాపు 52 శాతం వాటా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికాంకు దాదాపు 41 శాతం వాటా ఉండగా..విదేశీ ప్రమోటర్‌ సంస్థల వాటా 21.46 శాతంగా ఉంది. దాదాపు 37 శాతం వాటా పబ్లిక్‌ చేతిలో ఉంది. కాగా ఇంతకు ముందు భారతీ ఎయిర్‌టెల్‌ ఎఫ్‌డీఐ దరఖాస్తును డాట్‌ వెనక్కి పంపింది.

విదేశీ ఇన్వెస్టర్‌కు సంబంధించి స్పష్టత ఇవ్వక పోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు మాత్రం అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ వాటా 43 శాతంగా ఉంది. ప్రమోటర్‌ సంస్థ భారతీ టెలికాం విదేశీ సంస్థగా మారితే కంపెనీలో విదేశీ వాటా 84 శాతం దాటే అవకాశం ఉందని అంటున్నారు. కాగా విదేశీ ప్రమోటర్‌ గ్రూప్‌ నుంచి నిధులను సమీకరించనున్నట్టు గత ఆగస్టులోనే స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు భారతీ టెలికాం తెలిపింది. దీని ద్వారా కంపెనీలో విదేశీ వాటా 50 శాతం విదేశీ కంపెనీగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంచుకునేందుకు ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌ దరఖాస్తు చేసుకుంది.

ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి 43,000 కోట్లు చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు గాను 300 కోట్ల డాలర్లు సమీకరించే ప్రతిపాదనకు గత వారంలో ఎయిర్‌టెల్‌ బోర్డు అనుమతిచ్చింది. క్యూఐపీ, వాటా విక్రయం, రుణ పత్రాల ద్వారా ఈ నిధులు సమీకరించనుంది. 200 కోట్ల డాలర్ల సమీకరణకు కంపెనీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్యూఐపీలు లేదా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ లేదా రెండింటినీ ప్రకటించే అవకాశం ఉంది. మరో 100 కోట్ల డాలర్లు డిబెంచర్లు, బాండ్ల ద్వారా సమ కూర్చుకోనుంది. దీంతో భారతీ ఎయిర్ టెల్ కొంత మేరకు నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!