మనం మనుషులం కాలేమా.?

ఈ దేశంలో నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు, ఆర్ధిక మోసాలు లెక్క లేనంతగా పెరిగాయి. జాతి యావత్తు దేశ స్వాతంత్రం కోసం ఒక్కటై పోరాడింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బలిదానాలు, త్యాగాలు, ఆత్మార్పణలు చేసుకున్నారు. ప్రపంచానికే పాఠం నేర్పిన మహోన్నతమైన చరిత్ర, వారసత్వం కలిగిన ఘనత ఈ దేశానికే ఉన్నది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహాత్ముడు పుట్టింది ఇక్కడే. లోకం విస్తు పోయేలా రాజ్యాంగాన్ని రాసిన కథానాయకుడు బాబా సాహెబ్ అంబెడ్కర్ ఇక్కడి వాడే. ఉరి కొయ్యలను ముద్దాడిన రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్ లు ఈ మట్టిలో మొలకెత్తిన బిడ్డలే. మనకంటూ పాలకులున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకునే అతి పెద్ద దేశం మనది. ఇంతటి విశాలమైన, సువిశాలమైన కంట్రీ ఈ ప్రపంచంలోనే లేదంటే నమ్మగలమా.

1947 లో సిద్దించిన స్వేచ్ఛ నేటికీ విరాజిల్లుతూనే ఉన్నది. ఎన్నో కులాలు, మతాలు, జాతులు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. దారుణ మారణకాండలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో ఫ్రీడమ్, భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వం ఇక్కడ కొలువై ఉన్నది. ఎక్కడివారైనా ఇక్కడికి రావొచ్చు..వెళ్లొచ్చు. ఈజీగా బతకొచ్చు. ఇండియన్స్ ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి పేరు కూడా తీసుకు వస్తున్నారు. ఇదే సమయంలో దేశం తలొంచుకునేలా నీతి, ధర్మం తప్పిన వ్యక్తులు ఘోరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ మారింది. సమాజం మరింత మార్పులకు లోనవుతూ వస్తున్నది. అయినా వరల్డ్ వైడ్ గా ఎక్కడో ఒక చోట అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రతి దేశంలోనూ సమాజాల్లో సగభాగం పంచుకుంటున్న మహిళలు, బాలబాలికలు, యువతుల పట్ల మానసిక, శారీరక, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి.

ప్రతి రెండు నిమిషాలకు బాధితులు నమోదవుతున్నారు. ఇక ఇండియాలో నేరాల సంఖ్య అధికమవుతోంది. ఈ దేశానికి బలమైన పునాదిగా ఉన్న కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమైంది. కొన్ని తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు మంటగలిసి పోయాయి. అపరిమితమైన నెట్ కనెక్టివిటీ, డేటా వినియోగం, నాలుగు గోడల్లో దాచు కోవాల్సిన ప్రేమ, శృంగారం అంతా గుప్పెడు మొబైల్ లో టెలికాస్ట్ అవుతోంది. తోచినప్పుడు, కావాలనుకున్నప్పుడు, ఎవరూలేని చోట కావాల్సినంత బూతు దొరుకుతోంది. పోర్న్ సైట్స్ మిలియన్స్ దాటేశాయి. ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఒకప్పుడు పుస్తకాల్లో ఉండేది..ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటోంది. దీనిని నియంత్రించే వ్యవస్థ ఇంకా రాలేదు.

అణుబాంబులు, రాకెట్లు, మిస్సైల్స్ కంటే ప్రమాదకరమైంది ఈ బూతు. ఇక మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. సినీ, క్రీడా, వినోద రంగాలు అన్నీ వ్యాపార జపం జపిస్తున్నాయి. స్ఫూర్తిగా ఉండాల్సిన పంతుళ్లు గతి తప్పుతున్నారు. మతి తప్పి, మనీని ఎరగా వేసి అధికారాన్ని చేజిక్కించుకుని, బ్యాంకుల్ని లూటీ చేస్తూ దర్జాగా దేశం దాటి వెళ్లి పోతున్నా పట్టుకోలేని దుస్థితిలో పాలక వర్గాలు ఉన్నాయి. నేరం, చట్టం, రాజకీయమూ ఒక్కటై దేశపు జెండాను మలినం చేస్తున్నాయి. అయినా ఈ దేశంలో విలువల కోసం బతుకుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. గత కొంత కాలంగా ఇండియాలో ప్రతి చోటా హింసోన్మాదం పెచ్చరిల్లి పోయింది. హత్యలు, అత్యాచారాలకు లెక్కే లేదు. చిరునామా లేని చావులు, చంపడాలు, మాఫియాలు, డాన్ లు ఇలా చెప్పుకుంటూ పోతే దేశాన్ని శాసిస్తున్నారు. పాలిస్తున్నారు. అన్నీ తామై నడిపిస్తున్నారు.

పోలీసుల లెక్కల్లోకి రానివి కొన్ని లక్షల్లో కేసులుంటాయి. నేల నుంచి నింగికి వెళ్లగలిగాం. కానీ మన మధ్యనే మన కోసం బతికే వాళ్ళను బతికించుకోలేక పోతున్నాం. ఎన్ని చట్టాలు ఉన్నా ఏం లాభం. మనలో మార్పులు రానంత దాకా ఇలాగే దుర్ఘటనలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా దేశంలో సంచలనం కలిగించిన ప్రియాంక రెడ్డి కేసు. అనంతరం చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ వ్యవహారం. 80 శాతం జనం కాల్చివేత కరెక్టు అని మద్దతు చెబితే, 20 శాతం మాత్రం ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన అంటూ నిరసన వ్యక్తమైంది. అసలు సమాజం అంటేనే మనుషుల సమూహం కదూ. మన విజ్ఞత ఏమైంది. మనం ఎందుకు మనుషులు కాలేక పోతున్నాం. అన్నీ ఉన్నా కానివాళ్లమై పోతున్నాం. ముందు మనం మారాలి. మనలో మార్పు రావాలి. చట్ట సభల్లో వెళ్లే వాళ్ళు మనకు జవాబుదారీ కావాలి. మనుషులుగా తయారు చేసే విద్యా వ్యవస్థలో మార్పు రానంత కాలం సమాజం ఇలాగే ఉంటుంది. కేపిటలిజం.కమ్యూనిజం కంటే మనకు హ్యూమనిజం కావాలి. అప్పటి రోజు కోసం మనం ఏకం కావాలి.  

కామెంట్‌లు