తిరుగులేని టీమిండియా
ప్రపంచ క్రికెట్ లో టీమిండియా దూసుకెళుతోంది. నిలకడ కలిగిన ఆటగాళ్లతో అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. వన్డేలు, టీ-20 , టెస్ట్ మ్యాచుల్లో సైతం భారత జట్టుకు ఎదురే లేకుండా పోతోంది. ప్రస్తుతం మన జట్టుతోవెస్టిండీస్ తలపడుతోంది. మాంచి ఊపు మీదున్న మన క్రికెటర్లను కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతోంది వెస్టిండీస్ జట్టు. ఇప్పటికే ఒక సిరీస్ కోల్పోయి చతికిల పడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్...80వ దశకంలో భారత్‌పై కూడా గర్జించింది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. భారత్ గేర్ మార్చుకుంది. వన్డేల్లో సొంత గడ్డపై కరీబియన్‌ను మట్టి కరిపిస్తూనే ఉంది.
గడిచిన పుష్కర కాలంగా 4 వన్డేల సిరీస్ జరిగినా, 5 వన్డేల్లో తలపడినా, 3 వన్డేలు ఇలా సిరీస్ ఏదైనా విజేత మాత్రం టీమిండియానే. అంతగా రాటుదేలింది మనజట్టు. గతంలో వెస్టిండీస్ ఇటు వన్డేల్లో, అటు టి20ల్లో రెండేసి సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో, ఎదురు దాడి బ్యాటింగ్‌తో ప్రపంచ ప్రత్యర్థుల్నే వణికించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. తమ దీవుల్లో జరిగే కరీబియన్ లీగ్ పుణ్యమాని ఇప్పుడు టి20ల్లో సత్తా చాటుతున్నప్పటికీ... వన్డేల్లో మాత్రం నిలకడలేని ఆటతీరుతో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. . 1983 సీజన్‌లో ఇక్కడ ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో, 1987 సీజన్‌లో ఏడు వన్డేల సిరీస్‌ను 6–1తో గెలిచిన అసాధారణ జట్టు వెస్టిండీస్.
ప్రపంచ వ్యాప్తంగా వెస్టిండీస్ 80వ దశకంలో ఎక్కడ ఆడినా గెలిచేది. కానీ 90 నుంచి తిరోగమనం మొదలైంది. భారత్ పైచేయి సాధించడం కూడా ప్రారంభమైంది. కరీబియన్‌తో ముఖాముఖి సిరీస్‌లతో పాటు, విండీస్ ఆడేందుకు వచి్చన హీరో కప్, విల్స్ వరల్డ్ సిరీస్ లలో భారతే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై భారత్ గర్జిస్తుంటే బ్యాటింగ్ దిగ్గజం లారా, బౌలింగ్ లెజెండ్స్ వాల్ష్, అంబ్రోస్‌లు ఉన్న విండీస్ జట్టు ఏమీ చేయలేక పోయింది. రిక్తహస్తాలతోనే తిరుగు ముఖం పట్టింది. దీంతో ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ స్వర్ణయుగం కరిగి పోయింది. తర్వాత ఓ మామూలు జట్టుగా మిగిలి పోయింది. ఆటగాళ్ల వైఫల్యం, బోర్డు రాజకీయాలు, కాంట్రాక్టు వివాదాలు, సంక్షోభం ఇలా అన్నింటితో సతమతమై ఇప్పుడు కొన్ని మెగా టోర్నీల్లో క్వాలిఫయింగ్ ఆడే పరిస్థితికి దిగజారింది.
2007 నుంచి ఇప్పటివ రకు ఐదు సార్లు భారత గడ్డపై అడుగు పెట్టిన కరీబియన్ జట్టు పరాజయంతోనే తిరుగు పయనమైంది. 2007తో పాటు 2011, 2013, 2014, 2018దాకా ఇరు జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. కొన్నాళ్లుగా భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవలే ముగిసిన టి20 సిరీస్‌లోనూ భారత్ ఆల్‌రౌండ్ ప్రతాపం తెలిసిందే. బ్యాటింగ్‌లో టాపార్డర్ దుర్భేద్యంగా తయారైంది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి ఈ ముగ్గురు నిలబడితే ఎంతటి బౌలింగ్ అయినా చెల్లాచెదురు కావాల్సిందే. ఇక బౌలింగ్‌లోనూ షమీ, దీపక్ చాహర్ పేస్‌కు కుల్దీప్, చహల్, జడేజాల స్పిన్ అండ ఉండనే ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి