ఆరామ్‌కో..అదుర్స్

వరల్డ్ వైడ్ గా సౌదీ అరేబియా ఆయిల్ దిగ్గజ కంపెనీ ఆరాం కో చరిత్ర సృష్టించింది. స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరి పోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌ ధరను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. అంటే మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు అన్నమాట. ఈ షేర్‌ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్‌కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్‌కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీలు ఎక్సాన్‌ మొబిల్, టోటల్, రాయల్‌ డచ్‌ షెల్, షెవ్రాన్, బీపీ మొత్తం మార్కెట్‌ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం.

వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది. కాగా ఐపీఓ ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. ఇప్పటి వరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌కో బ్రేక్‌ చేసింది. ఇక బంపర్‌ లిస్టింగ్‌తో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా కూడా ప్రపంచ నెంబర్‌ వన్ కంపెనీగా సౌదీ ఆరామ్‌కో నిలిచింది.

అంతే కాకుండా లిస్టెడ్‌ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్‌ 10 స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో ఒకటిగా సౌదీ అరేబియా స్టాక్‌ ఎక్చేంజ్ లో నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటి దాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువతో యాపిల్, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ 92,600 కోట్ల డాలర్లు, ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ 86,200 కోట్ల డాలర్లు, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 57,200 కోట్ల డాలర్లతో నిలిచాయి.

కామెంట్‌లు