ఆర్థికం ఆందోళనకరం
ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు భారత మాజీ ప్రధాని, జగమెరిగిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. దేశ వృద్ధి రేటు క్షీణత ప్రమాదాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే చాలా సార్లు దేశ స్థూల జాతీయోత్పత్తి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఆర్థిక మంత్రి కూడా అయిన మన్మోహన్ మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడి పోవడంపై స్పందించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో జీడీపీ 4.5 శాతానికి పడి పోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు.
వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సి ఉండగా 4.5 శాతానికి పడి పోవడం విచారించ దగ్గ విషయమన్నారు. ఆర్థిక విధానాల మార్పు ఏ విధంగాను సానుకూల ఫలితాలు ఇవ్వ లేదన్నారు. అంతే కాదు ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలంటే 8 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ బలోపేతంతో సమాజంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని సానుకూలంగా మార్చవచ్చన్నారు. సమాజ స్థితి ఏ విధంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఉపాధి రంగాలైన ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మార్కెట్‌లో తిరిగి డిమాండ్ పుంజు కునేలా చొరవ చూపాలని సూచించారు మన్మోహన్ సింగ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి