హక్కుల నేత అరెస్ట్

పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ చట్ట సవరణ భారత రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదంటూ విద్యార్థులు, పౌర సమాజం, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని హోమ్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇండియాలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, అస్సోమ్ రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా గువాహటి లో ప్రముఖ సమాచార హక్కు కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌ ఇంట్లో  జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌ టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

ఎన్‌ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్‌ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్‌ కార్డు, ఎస్బీఐ డెబిట్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్‌ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను మీడియాకు చూపించారు.

కజిరంగలోని కేఎంఎస్‌ఎస్‌ ఆర్చిడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్‌ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె స్పష్టం చేసింది. కాగా, గొగోయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దీంతో గొగోయ్ మద్దతు దారులు అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దేశంలో బీజేపీ సర్కార్ తన హిందుత్వ ఎజెండాను అమలు చేయాలని ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!