ధర్మాసనం సంచలన నిర్ణయం


సమాచార హక్కు చట్టం ఇకపై ఈ చట్టం పరిధిలోకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌  కార్యాలయం కూడా చేరింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలనీ, భంగకరంగా మార కూడదని వ్యాఖ్యానించింది.  సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది.

సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం విస్తృతిని మరింత పరిపూర్ణం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల   రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ అధికారి దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

సమాచార హక్కు చట్టాన్ని నిఘా సాధనంగా వాడ కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఇతర సభ్యులుగా ఉన్నారు. జడ్జీల  నియామకాలు అంతు చిక్కని రహస్యంగా ఉన్నాయి. వాటిలో పారదర్శకత అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హైకోర్టులో వాదించారు. జడ్జీలు మరో ప్రపంచంలో జీవిస్తున్నారా అని ప్రశ్నించారు. న్యాయవ్య వస్థ ప్రజల నిఘాకు మినహాయింపు కాదని, అతీతం అంతకన్నా కాదని ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. 

చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ జనవరి 10, 2010లో ఢిల్లీ హైకోర్టు ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూ ర్తి హక్కు కాదనీ, న్యాయమూర్తి బాధ్యత’అని అభివర్ణించింది. చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయాన్ని సమాచర హక్కు చట్టం పరిధిలోకి తేవడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బ తింటుందన్న సుప్రీంకోర్టు వాదనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునిచ్చిన జస్టిస్‌ సేన్‌ రిటైరవగా, జస్టిస్‌ మురళీధర్‌ ప్రస్తుతం హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా ఉన్నారు. సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలనే వాదన తొలుత తీసుకొచ్చింది ఆర్టీఐ కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌.

జడ్జీల  ఆస్తుల సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ అగర్వాల్‌ 2007లో సుప్రీంకోర్టుకి అప్పీల్‌ చేశారు. జడ్జీల నియామకాల్లో కొలీజియం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. దీంతో అగర్వాల్‌ కేంద్ర సమాచార కమిషన్‌ ని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్‌కు అనుకూలంగా స్పందించింది. సీఐసీ ఉత్తర్వుల్ని ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్‌ చేయడంతో 2010లో సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలో కొస్తుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పగా దీన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!