హైపవర్ కమిటీ వద్దన్న సర్కార్

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కళాకారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యతల నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సమ్మె నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు భావించిన సంగతి తెలిసిందే. సమ్మె సమస్య పరిష్కారానికి ఈ మేరకు జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై మీ నిర్ణయం తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్‌ విముఖత వ్యక్తం చేసింది.1947పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు లోబడి పని చేయాలని, కానీ ఆర్టీసీ కార్మికులు ఏ చట్టాలను పట్టించు కోవడం లేదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.  సెక్షన్‌ 10 ప్రకారం లేబర్ కమిషన్‌కు ఈ సమ్మె విషయమై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్‌ కోర్టు పరిధిలో ఉందంటూ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇరు వర్గాలు మెట్టు దిగడం లేదు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడడం లేదు. రాజ్యానికి రాజు లాంటి వాడు రాష్ట్రానికి సీఎం. కానీ ఇదేదీ పరిగణలోకి తీసు కోవడం లేదు. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరో వైపు కార్మికులు ఓ మెట్టు దిగుతామని కోర్టుకు తెలిపారు. మరి ప్రభుత్వం మాత్రం ఆ వైపు ఆలోచించడం లేదు. ఇదే క్రమంలో కమిటీ ఏర్పాటును ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా స్వాగతించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు విముఖత చూపడంతో హైకోర్టు ఈ అంశంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!