పెద్దాయనా నీకో దండం
కోట్లున్నా సాయం చేసేందుకు చేతులు రావు. అకౌంట్లలో కోట్లు మూలుగుతున్నా, లక్షల్లో వేతనాలు పొందుతున్నా, చేతినిండా సంపాదిస్తున్నా పట్టెడన్నం పెట్టలేని ప్రబుద్ధులు ఎందరో ఈ సమాజంలో నేటికీ ఉన్నారు. కానీ డబ్బున్న మహారాజులు సిగ్గుతో తలొంచుకునేలా ఓ చిరు కుటుంబానికి చెందిన వ్యక్తి భారత సైన్యానికి తన వంతుగా సహాయం చేశాడు. వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారి గానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు. తాను వృద్ధాశ్రమంలో ఉంటూనే కష్టపడి సంపాదించిన 50 లక్షల రూపాయలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు.
సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి 50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్ అంద జేశారు. 78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ల్లదీస్తున్నారు విశ్వనాథం.
యాభై ఏళ్లు వ్యాపారంలో ఎంతో సంపాదించా.. నేను పుట్టిన తీగుళ్ల తో పాటు నేను పెరిగి, వ్యాపారం చేసిన హుజూర్‌నగర్ ప్రాంతంలోనూ అనేక దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశా. కానీ ఈ చరమాంకంలో దేశం కోసం పోరాడుతున్న సైన్యం, వారి కుటుంబాలకు నాకు తోచిన సహాయం చేయాలని పించింది.
మిత్రుడు లక్ష్మణరావు సహకారంతో సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ను సంప్రదించానని తెలిపారు గుప్తా.50 లక్షలను గవర్నర్ చేతుల మీదుగా సైన్యానికి విరాళమిచ్చా. ఈ రోజు చేసిన పనే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తోంది అని చెప్పారు. ఇదే విషయమై సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్ మాట్లాడుతూ విశ్వనాథం భూరి విరాళం ఈ సమాజంలోని అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికైనా తమ సామాజిక భాధ్యతను మరువకుండా ముందుకు రావాలి మరింత చేతనైనంత మేరకు సయాం చేస్తే జన్మ ధన్యమవుతుంది. దాతృత్వంతో తన ఉదారతను చాటుకున్న గుప్తాకు మనమంతా కృతజ్ఞతలు చెబుదాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి