శివసేనపై ట్రబుల్ షూటర్ ఫైర్

శివసేన కొత్త డిమాండ్లకు తాము తలొగ్గనందునే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా స్పష్టం చేశారు. సీఎం పదవిని పంచు కోవాలనే శివసేన ప్రతిపాదనను తాము ఆమోదించ లేదని చెప్పారు. తమ కూటమి అధికారం లోకి వస్తే మహారాష్ట్ర తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాను కూడా బహిరంగంగా ప్రకటించామని షా వెల్లడించారు.

అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని శివసేన తర్వాత కొత్త డిమాండ్‌తో ముందుకు వచ్చిందని ఆరోపించారు. శివసేన డిమాండ్‌ తమకు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని చెప్పారు. మరో వైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దిశగా కనీస ఉమ్మడి కార్యక్రమం రూప కల్పనపై పార్టీలు సంప్రదింపులు జరుపు తున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పృధ్వీరాజ్‌ చవాన్‌ వెల్లడించారు.

ముసాయిదా సీఎంపీని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలు ఆమోదించిన తర్వాత ఈ దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర సీఎం పదవి శివసేన దేనని, తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన నేత పగ్గాలు చేపట్టనున్నారని ఎంపీ సంజయ్ రావత్ స్పష్టం​ చేశారు. ఈ మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కామెంట్‌లు