దేశం కోసం కలిసి సాగుదాం
స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగుదామని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కోరారు. మహారాష్ట్ర రాజకీయాలతో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. మనది విశాల కుటుంబమని, ప్రజల కోసం సమిష్టిగా పని చేద్దామని ఈ ప్రధాని మోదీ భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో ఎన్డీయేకు పట్టం కట్టారని గుర్తు చేశారు.
మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో స్వల్ప విభేదాలు, వైరుధ్యాలు ఎన్డీయేను బలహీన పరచలేవని మోదీ వ్యాఖ్యానించారు. మ రోవైపు ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దం పడుతుందని సమావేశానంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధించే వరకూ తాము ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకోమని స్పష్టం చేశారు.కాగా, శివసేన కీలక ఎన్డీయే భేటీకి హాజరుకాక పోవడం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
ఇక బీజేపీ కార్యనిర్వాహక సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలకు పార్టీ సభ్యుల హాజరు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. సభలో కీలక అంశాలను లేవనెత్తాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. అత్యుత్తమైన పార్లమెంట్ లో మనం హుందాగా వ్యవహరించాలి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారి ఆశలను నెరవేర్చేలా కృషి చేయాలి. నిర్మాణాత్మకమైన సూచనలు ఎవరు చేసినా స్వీకరించాలని కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి