కార్మికుల ఆందోళన..ఫిట్‌మెంట్‌ పెరిగేనా


ఓ వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతుండగా ఇంకోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణ కోసం పట్టుబడుతున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం పీఆర్‌సీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం ఆనవాయితీ. పీఆర్‌సీ 25 శాతం వరకు ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పీఆర్‌సీలో గత ఫిట్‌మెంట్‌కు అదనంగా 63 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీ చైర్మన్‌కు నివేదికలు అంద జేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం నివేదిక నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది.

ఆ వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో సమావేశమై ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్‌సీ నివేదికను 12 రోజుల్లో సమర్పించాలంటూ పీఆర్‌సీ చైర్మన్‌ బిస్వాల్‌ను సీఎం  ఆదేశించారు. ఫిట్‌మెంట్‌ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ సాధనకు సీఎంను ఒప్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి ఒక శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏటా అదనంగా 225 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని పీఆర్‌సీ వర్గాలు  అంచనా వేశాయి. ఇలా ఒక శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు కట్టాయి.

రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే 4,500 కోట్లు, 22 శాతం ఇస్తే  4,950 కోట్లు, 24 శాతం ఇస్తే  5,400 కోట్లు, 25 శాతం ఇస్తే 5,625 కోట్లు,  27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే 6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. పీఆర్‌సీ నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసం 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని, అంతకంటే ఎక్కువ సాధించుకోవాలన్న ఆలోచనల్లో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగులకు పీఆర్‌సీతో పాటు రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు వంటి అంశాలపైనా వేతన సవరణ సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగులకు రాబోయే కాలం పండగే అన్నమాట. 

కామెంట్‌లు