అశ్వత్థామ రెడ్డి అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోక పోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులు నిరవధిక దీక్షకు దిగారు. ఆయా నేతల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వైద్యులు వెంటనే చికిత్స చేయాలని సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా ఇంట్లోనే ఉంటూ తలుపు మూసుకుని దీక్షకు దిగిన మరో లీడర్ రాజిరెడ్డి తలుపులు పగులగొట్టారు. ఆయనను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే క్రమంలో ఆయనను తరలిస్తుండగానే రాజి రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

ఇంకో వైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను
బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే క్రమంలో పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయినా పోలీసులు వినిపించు కోలేదు. అశ్వత్థామరెడ్డిని ఆయన నివాసం నుంచి పోలీస్‌ వాహనంలో తరలించారు.

దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జేఏసీ నేతను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపించారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు .

ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్‌, జితేందర్‌ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్‌, జితేందర్‌ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. చివరకు వారిని వదిలేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

కామెంట్‌లు