గంభీర్ రివర్స్ కౌంటర్

మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. ఎంపీగా నియోజకవర్గం పట్ల తనకున్న చిత్తశుద్ధి గురించి, అక్కడ తాను చేసిన అభివృద్ధే మాట్లాడుతుందని గంభీర్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలకు అదే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర తరమైన నేపథ్యంలో, ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్యానెల్‌ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌ కామెంట్రీ నిమిత్తం గంభీర్‌ ఇండోర్‌లో ఉండటంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు. కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే పాల్గొనడంతో ప్యానెల్‌.. భేటీని రద్దు చేసింది. ఇండోర్‌లో జిలేబీలు తింటున్న గంభీర్ ఫొటోలను సోషల్‌ మీడియాలో ఆప్‌ నేతలు పోస్ట్ చేశారు. గంభీర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు.
దీనిపై స్పందించిన గౌతం గంభీర్‌ ట్విటర్‌ వేదికగా వారికి కౌంటర్‌ ఇచ్చారు. నా నియోజకవర్గం, పట్టణంలో జరిగే అభివృద్ధిని చూసి నా గురించి మాట్లాడాలి. ఘాజీపూర్‌లో స్వచ్ఛత కోసం అత్యాధునిక కంపోస్టు యంత్రాలు పెట్టించాం. ఈడీఎంసీ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేశాం. మహిళల కోసం పాడ్‌ వెండింగ్‌ యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఉచిత భోజన సదుపాయం కల్పించాం. రాబోయే నాలుగున్నరేళ్లలో నేను చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల్లో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే. నాకు ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. గత ఆర్నెళ్లుగా నావైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు అన్నారు ఈ ఎంపీ.
అంతే కాదు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి తూర్పు ఢిల్లీలోని నా కార్యాలయంలోనే కూర్చుంటాను. ప్రజల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వారు భావించిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తాను. ఎంపీ లాడ్ నిధుల కిందే కాకుండా, జీతం ద్వారా వచ్చే వేతనాన్ని కూడా ప్రజా సంక్షేమానికే వినియోగిస్తానని ప్రతిఙ్ఞ చేశాను. వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో రాబోయే రెండు వారాల్లో నియోజకవర్గంలో ఎయిర్ ఫ్యూరిఫయర్లతో పాటుగా కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతపై చర్చించి.. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశ పెట్టబోతున్నాం. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదు. వ్యాపార ప్రకటనల ద్వారా సంపాదించాను. నియోజకవర్గ, పట్టణ, దేశ ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు గౌతమ్ గంభీర్. ఆప్ నాయకులు విమర్శలు చేసే ముందు మరోసారి ఆలోచించు కోవాలని ఈ ఎంపీ హితవు పలికారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!