సీట్లు తక్కువ..డిమాండు ఎక్కువ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు జనాన్ని ఆకట్టు కుంటున్నాయి. ఇదే క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యా నిధి పథకానికి విద్యార్థులు పోటెత్తారు. ఈ పథకం కింద పరిమిత తక్కువ సంఖ్యలో మాత్రమే సర్కారు అనుమతి ఇస్తోంది. దీని కోసం దరఖాస్తుల సంఖ్య మాత్రం భారీగా ఉంటోంది. 2016 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.  తొలి రెండేళ్లలో 300 దరఖాస్తులు కూడా రాలేదు. ప్రస్తుతం కోటాకు మించి పదింతలు దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. దరఖాస్తుల పరిశీలన, వడ పోత కత్తిమీద సాములా మారుతోంది. ఎంజేపీ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద ప్రతి ఏడాది 300 మందికి అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఈబీసీలకు 5 శాతం కేటాయిస్తుండగా, మిగతా 95 శాతాన్ని ప్రాధాన్యత క్రమంలో బీసీ లోని కేటగిరీల వారీగా అవకాశం ఇస్తున్నారు.

ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఇటీవల దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా 3,116 మంది దరఖాస్తులు వచ్చాయి. దీంతో పోటీ పెరిగింది. ఒక దానికి పది మంది పోటీ పడుతున్నారు. అనూహ్యంగా దరఖాస్తులు పెరగడంతో వీటి పరిశీలనకు దాదాపు నెలన్నర సమయం తీసుకున్నారు.  ఓవర్సీస్‌ విద్యా నిధి పథకాన్ని అన్ని సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి పేరిట అమలు చేస్తుండగా,బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యా నిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సీఎం ఓవర్సీస్‌ విద్యా నిధిగా అమలు చేస్తున్నారు. కాగా బీసీ ఓవర్సీస్‌ విద్యా నిధి పథకం కింద ఎంపికైన లబ్ధి దారు విదేశాల్లో పీజీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.

దీన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిబంధనలకు అనుగుణంగా లబ్ధి చేకూరుస్తుండగా, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మాత్రం అత్తెసరు సంఖ్యలోనే లబ్ధి కలుగుతోంది. దీంతో కోటా పెంచితే మేలు జరుగుతుందని భావిస్తున్న అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దరఖాస్తులు, లబ్ధి, ఏటా బీసీ సామాజిక వర్గం నుంచి ఎంత మంది విదేశీ విద్య కోసం వెళ్తున్నారనే అంశాలపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వీటి ఆధారంగా ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!