బీజేపీపై తలైవా ఫైర్

భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు తమిళ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ఆయన కాషాయంతో స్నేహం నెరుపుతున్నారనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు తలైవా. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండ బద్ధలు కొట్టారు. రాజ్‌ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా   తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై స్పందించారు.

నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోందని రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయ రంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమ కండి. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెర లేపకండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయ వస్త్రం కట్టి, మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించారు.

ఈ ఘటన తమిళ నాట పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా, ఈ ఘటన బీజేపీ ప్రోద్భలంతోనే జరిగిందన్న రీతిలో రజనీకాంత్ చేసిన కామెంట్స్ తమిళనాడులో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. గతంలో ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ చెప్పడంతో, ఫ్యాన్స్ రజని కాషాయానికి దగ్గరవుతున్నారని అనుకున్నారు. అయితే వారి ఊహాగానాలు తప్పని తేల్చి పారేశారు తలైవా. అలాగే అయోధ్య కోర్టు తీర్పు అంశంపై స్పందించారు. తీర్పు ఎలా వచ్చినా సుప్రీం కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని రజనీకాంత్ పిలుపునిచ్చారు. అంతా సంయనం పాటించాలని కోరారు. 

కామెంట్‌లు