కమలం కటీఫ్..శివసేనకు ఝలక్


పొలిటికల్ కన్ ఫెసన్ కొనసాగుతోంది. మరాఠాలో రాజకీయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారిని కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాక పోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్నటి దాకా స్నేహితులుగా ఉన్న బీజేపీ, శివసేన పార్టీలు ఇప్పుడు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ చివరి దాకా ప్రయత్నాలు సాగించారు. అయినా ఫలితం లేక పోయింది.

చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచు కుందామని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే సూచించారు. దీనిని ఎంత మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఫడ్నవిస్. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. మరాఠాలో గత 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. గవర్నర్‌ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా, లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఫడ్నవిస్ ఉద్దవ్ ఠాక్రేపై సీరియస్ అయ్యారు.

ప్రభుత్వ ఏర్పాటుకు తాము సానుకూలంగానే ఉన్నా, శివసేన తమతో కలిసి రావడంలేదని ఆరోపించారు. సీఎం పదవిపై ఆశలతో శివసేన నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండి పడ్డారు. తమను తీవ్రంగా అవ మానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వారి వ్యాఖ్యలు సరైనవి కావని హితవు పలికారు. తమ భవిష్యత్తు కార్యాచరణను కేంద్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని ఫడ్నవిస్‌ వెల్లడించారు. మొత్తం మీద ఇరు పార్టీల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది.

కామెంట్‌లు