చారిత్రాత్మకం సుప్రీం తీర్పు సంచలనం
దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మ భూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది.
1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది. జస్టిస్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నా భిప్రాయాలకు తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది. షియా వక్ఫ్ బోర్డు, అఖాడా వాదనలను న్యాయస్థానం తోసి పుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్ట విరుద్ధమని సీజేఐ వ్యాఖ్యానించారు.
ఓ వైపు సుప్రీం కోర్టుకు వరుసగా సెలవులు ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తులు అయోధ్యపై తీర్పు చెప్పేందుకు సిద్ద పడ్డారు. మరో వారం రోజుల్లో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ రిటైర్ కానున్నారు. అంత లోపు అన్ని కేసులకు సంబంధించి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ కేసుల్లో ప్రధానమైన కేసు అయోధ్య, రామ జన్మ భూమి వివాదం కూడా ఉండటం విశేషం. తీర్పు వెలువరించిన సందర్భంలో దేశమంతటా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా ఈ తీర్పు ఒకరికి విజయమో లేదా మరొకరికి అపజయమే కాదని స్పష్టం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ.
కాగా సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే దేశంలో ఆర్థిక మందగమనం ఏర్పడిందని ఆరోపిస్తోంది. తీర్పుపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబును నాయుడు స్పందించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును అందరం గౌరవించాలని కోరారు. మొదట రామ మందిరం...ఆ తర్వాత ప్రభుత్వం. అయోధ్యలో ఆలయం, మహారాష్ట్రలో ప్రభుత్వం.. జై శ్రీరామ్ అంటూ శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభ పరిణామం. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. యావద్భారతం సాధించిన ఘన విజయమిది. కేసు విషయంలో గతాన్ని పక్కన పెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అయితే ఎంఐఎం అధినేత ఒవైసి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ తీర్పు తో మరోసారి అయోధ్య అంశం దేశంలో వైరల్ గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి