కదం తొక్కిన కార్మికులు..రెచ్చి పోయిన పోలీసులు

చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. మరో మిలియన్ మార్చ్ ను తలపింప చేసింది.ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్‌ బండ్‌పైకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. భారీ సంఖ్యలో కార్మికులు తరలి రావడంతో వీరిని అడ్డు కోవడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై మండిపడ్డారు. మహిళా కార్మికులను అడ్డు కోవడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషా మహల్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద నుంచి వెళ్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు.రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంత నిర్బంధం దేశంలో ఎక్కడా లేదని, ఎప్పుడు ఇలాంటి నిర్బంధాన్ని చూడలేదని వాపోయారు. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మరో వైపు అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు ప్రజా, విద్యార్ధి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మహిళలని చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!