న్యాయాన్ని నిలబెట్టారు..చరిత్రలో నిలిచారు


ఈ దేశంలో సామరస్యానికి ప్రతీకగా నిలిచారు అయోధ్య వివాదంలో కీలక తీర్పు చెప్పిన న్యాయమూర్తులు. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఎంతో ఉత్కంఠకు తెరతీసిన ఈ సమస్యకు ఐదుగురు ఏక వాక్యంతో ఇచ్చిన తీర్పు ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంకా న్యాయం బతికే ఉందని చాటి చెప్పారు. మరో వైపు తెలంగాణాలో సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. ఇదో కీలక పరిణామం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దీనికి సారథ్యం వహించగా, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం, స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పు నిచ్చింది.

ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌. 1954 నవంబర్‌ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్‌ కౌన్సిల్‌లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్‌–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. 

రెండో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే. బోంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో పని చేశారు. దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. గొగోయ్ రిటైర్ అయ్యాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. 2021 ఏప్రిల్‌ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.

జస్టిస్‌ చంద్రచూడ్‌ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998 నుంచి దాదాపు రెండేళ్ల పాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2013లో అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాలలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఉపన్యాసాలిచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ జాన్‌పూర్‌లో జన్మించారు. అలహాబాద్‌ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్‌ భూషణ్‌, 1979లో యూ పీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ నజీర్‌ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. మొత్తం మీద ఈ ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు తమ తీర్పుతో చరిత్రలో నిలిచి పోయారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!