సామాన్యుల కోసం మహాప్రసాదం

ప్రపంచంలోనే సంపన్నమైన దేవదేవుడిగా పేరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రతి రోజు లక్షలాది మంది తిరుమలకు వస్తుంటారు. కోట్లాది మందికి ఆయన ఇష్టదైవం. కాలి నడకన ప్రతి రోజు వేలాదిగా నడిచి క్యూ ద్వారా దర్శించుకుంటారు. కొన్ని తరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. లెక్కించ లేనంతగా నోట్ల కట్టలు, దాచు కోలేనంతగా ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, కోట్లు పలికే ఆస్తులు, స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. సామాన్యుల నుంచి బడా బాబులు, ధనవంతుల దాకా స్వామి, అమ్మవార్ల కృప కోసం వేచి చూస్తారు. గతంలో దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలను పలుమార్లు దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన భక్తుల ఇబ్బందులను దగ్గరుండి చూసి చలించి పోయారు.

ఎక్కడినుంచో, సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసల కోర్చి తిరుమలకు వస్తే ఇక్కడ కనీస వసతులు లేకపోవడం ఏంటని ఈవోను ప్రశ్నించారు. అంతే కాకుండా నిత్యం అన్నదానం జరిగేలా చూడాలని ఈఓ కేఆర్కే ప్రసాద్ ను ఆదేశించారు. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధ మానమై వేల భక్తుల నుంచి లక్షకు చేరుకుంది. దీంతో పాటు తిరుమలకు వచ్చే వారిని ఎక్కువగా ఆకట్టుకునేది లడ్డు ప్రసాదం. ఇక్కడ లభించే ఈ లడ్డుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చాలా పవిత్రతతో అత్యంత రుచి కరంగా దీనిని తయారు చేస్తారు. వందలాది మంది సిబ్బంది ఇందులో భాగం పంచుకుంటారు. తాజాగా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ వచ్చాక కొంచం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మారింది. పాలక మండలి మారింది. వివిఐపి బ్రేక్ దర్శనాలకు చెక్ పెట్టారు. సామాన్యులకు త్వరగా దర్శనం చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.

చంటి పిల్లల తల్లులు, వృద్దులకు వేరే కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టింది పాలక మండలి. అయితే తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాధాన్యమున్న లడ్డూల్లో రెండు రకాలున్నాయి. ఇందులో చిన్న లడ్డూలను భక్తులందరికీ విక్రయిస్తారు. పెద్ద లడ్డూలు, వడలు మాత్రం టీటీడీ అధికారుల సిపారసు లేఖలపై కొందరికే లభిస్తాయి. పైగా వాటిని ఆలయం లోపల వగపడి వద్దే తీసుకోవలసి ఉంటుంది. ఈ విధానంలో కొన్ని మార్పు లు చేసి పెద్ద లడ్డూ, వడల విక్రయాలను ఆలయం వెలుపలికి మార్చాలని, వాటి తయారీ సంఖ్య పెంచి సాధారణ భక్తులకు సైతం కొన్ని అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం ఆలయం లోపల ప్రసాదాల వితరణ ప్రదేశానికి తూర్పు వైపున ఉన్న వగపడి అరలో పెద్దలడ్డూలు, వడలు విక్రయిస్తున్నారు.

దీనిపై సమాలోచనలు జరిపిన అదనపు ఈవో ధర్మారెడ్డి ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్‌లోనే పెద్ద లడ్డూలు, వడలు కూడా విక్రయించాలని ఆదేశించారు. ఆలయం లోపల తయారైన వీటిని కన్వేయర్‌ బెల్టు ద్వారా వెలుపలకు తరలించి సేల్స్‌ కౌంటర్‌కు పంపుతారు. అక్కడ సిఫారసు లేఖలు ఉన్న భక్తులతో పాటు సిఫారసులు లేని వారికి కూడా కొన్ని అందుబాటులో ఉంచుతారు. రద్దీకి అనుగుణంగా తయారీ సంఖ్యను నిర్ధారించి విక్రయిస్తారు. మరోవైపు కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు ప్రస్తుతం పెద్ద లడ్డూ, వడ ప్రసాదాలను అయినమహల్‌ మండపంలో అందజేస్తున్నారు. దాంతో అక్కడ రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతున్నందున ఆ పంపిణీని కూడా ఆలయం వెలుపల కౌంటర్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సామాన్యులకు సైతం మహాప్రసాదం అందనుంది. 

కామెంట్‌లు