అమ్మ దయ కోసం భక్తజనం

విజయదశమి ముగిసినా ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన దుర్గామాత దర్శనం కోసం భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రద్దీ పెరిగింది. కాగా యథావిధిగా నిజ రూపంలోనే అమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణ భక్తులతోపాటు భవానీ దీక్ష చేపట్టిన భక్తులు భారీ సంఖ్యలో అమ్మ వారి కృప కోసం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు అమ్మ వారి నినాదాలతో దద్దరిల్లాయి. కేశ ఖండనశాల, స్నాన ఘాట్‌లు భక్తులతో పూర్తిగా నిండి పోయాయి. గత నెల 29న దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా జగన్మాత కనకదుర్గమ్మ తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో, మూడవ రోజు గాయత్రీ దేవిగా దర్శనం ఇచ్చారు.

ఇక నాల్గవ రోజు అన్నపూర్ణ గా, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి రూపం లో, ఆరవ రోజు మహాలక్ష్మి గా , ఏడవ  రోజు సరస్వతీదేవి గా, ఎనిమిదో రోజు దుర్గాదేవి గా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అలంకారాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. విజయదశమి రోజు  రాజ రాజేశ్వరి దేవిగా భక్తులను కరుణించింది. దశమి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయంలో నిలుపుదల చేసిన నిత్య ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. ఎప్పటి లాగానే  అమ్మ వారికి నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా పండుగకు ముందు 40 రోజులుగా కఠోర దీక్ష చేసిన భవానీ మాలధారులు విజయదశమి రోజున దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది విజయదశమి మంగళవారం రావడంతో ఆ రోజు దీక్ష విరమించి.. తలనీలాలు సమర్పించడానికి ఆసక్తి చూపలేదు.

మరుసటి రోజు ఏకాదశి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీక్షను విరమించారు. సాధారణ భక్తులతోపాటు భవానీ భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు నిండి పోయాయి. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో కొండపై క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మ వారి దర్శనం చేసుకునేంత దాకా తిరిగి ఇళ్లకు వెళ్లే ప్రసక్తి లేదని భవాని భక్తులు చెబుతున్నారు. వసతి సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు కొంచం శ్రద్ధ పెట్టలేదని కొందరు భక్తులు వాపోయారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చిన వారిలో చాలా మంది టికెట్లను పెంచారని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ఎలాంటి అపశ్రుతులు లేకుండా ఉత్సవాలు ముగియడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!