చార్జీల మోత..జనానికి వాత

తిండి లేకపోయినా బతుకొచ్చు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా, వాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో దైనందిన జీవితంలో భాగమై పోయింది. మొత్తం మీద తప్పనిసరి కావడంతో టెలికాం కంపెనీలు వినియోగదారులతో ఆటలాడుకుంటోంది. వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఆఫర్లతో ఆకట్టు కోవడం, తర్వాత సబ్ స్క్రైబర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించిన రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చెందిన జియో ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. దీంతో తెలియకుండానే చార్జీలు వడ్డించేందుకు రంగం సిద్ధం చేసింది. మొదట అంతా ఫ్రీ అంటూ జనాన్ని బురిడీ కొట్టించి గణనీయమైన ఆదాయాన్ని పొందుతోంది.

ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్‌ జియో చార్జీలు అమలు చేస్తోంది. దీంతో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంచే పనిలో పడ్డాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కు కోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో  గోపాల్‌ విఠల్‌ స్పష్టం చేశారు. మరోవైపు, ఇంటర్‌కనెక్షన్‌ యూసేజ్‌ చార్జీలంటూ యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఖండించారు. ఇంకో వైపు 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్‌ ఇండియా కల సాకారం కాగలదని అన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్‌ చెప్పారు.

మరోవైపు ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్‌ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్‌టెల్‌ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికాం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బ తీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఇతర టెల్కోలు కూడా  ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచి పెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ ఆరోపించారు. మొత్తం మీద టెలికాం కంపెనీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూనే కస్టమర్స్ నెత్తిన శఠగోపం పెడుతున్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!