ఆర్టీసీకి నష్టం .. మెట్రోకు లాభం

తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె దెబ్బకు ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్స్ డ్రైవర్స్ తమ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో జనం కస్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ జర్నీ చేసేందుకే సరిపోతున్నాయి. బహిరంగంగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత రవాణా శాఖాధికారులు పట్టించు కోవడం లేదు. సమ్మె ప్రభావంతో ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో అది అమలు కావడం లేదు. వాహనదారుల అడ్డగోలు వసూళ్ల దందాగా దర్జాగా సాగుతోంది. ఇదిలా ఉండగా సమ్మె కారణంగా ఆర్టీసీకి రోజుకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం దిగనంటోంది.

కార్మికులు మాత్రం సై అంటూ సమ్మె సైరన్ మోగిస్తున్నారు. మరో వైపు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి అయిదు నిమిషాలకు మెట్రో ట్రైన్స్ నడపాలని సర్కార్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించింది. దీంతో భారీ ఆదాయం సమకూరుతోంది. గ్రేటర్‌ వాసుల కలల మెట్రో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 3.80 లక్షల మంది ప్రయాణికులతో తాజా రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా..రద్దీ కారణంగా ఆ రికార్డును అధిగమించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యలో మెజార్టీ సిటీజనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో మెట్రో రైళ్లు నిండి పోతున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి.

ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లోని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్‌ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టూగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసి పోతున్నాయి. ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ, ఎగ్జిట్‌ అయ్యే ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆయా స్టేషన్లలో ప్రత్యేక టిక్కెట్‌ కౌంటర్లు, అదనపు సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. రద్దీ రూట్లలో ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకో రైలును నడుపుతున్నారు. ఇదిలా ఉండగా  రైళ్లలో ఏసీ సదుపాయం అంతగా లేదని..స్టేషన్లలో టాయిలెట్స్‌ వద్ద ,టిక్కెట్‌ కౌంటర్ల రద్దీతో ఇబ్బందుల పాలవుతున్నట్లు ప్రయాణీకులు వాపోతున్నారు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె కారణంగా  మెట్రో పంట పండుతోంది..కాసులు కొల్లగొట్టేలా చేస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!