దంగల్ వైరల్..జిన్ పింగ్ మెచ్చిన మూవీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా భారతీయ సినిమా రంగంలో చరిత్ర సృష్టించింది. కలెక్షన్లలో సునామీ సృష్టించింది. సినిమా విడుదలై ఏళ్ళు గడిచినా ఇంకా ఆ మూవీ ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. దంగల్ పేరు మరోసారి దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇదే సినిమా గురించి సాక్షాత్తు భారత దేశపు ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోదీ హర్యానా ఎన్నికల ప్రచారం సందర్బంగా ప్రస్తావించారు. డ్రాగన్ చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ ప్రత్యేకంగా దంగల్ సినిమాను చూశారని చెప్పారు. ఆ సినిమా తనకెంతగానో నచ్చిందని అన్నారని మోదీ తెలిపారు. మహిళలు ఏదైనా సాధించగలరని సినిమాలో బాగా చూపారని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారన్నారు.
జిన్‌పింగ్ వ్యాఖ్యలు తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు మోదీ. కాగా కుస్తీ యోధులు బబిత, గీతలను ఆయన తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ ప్రపంచ స్థాయి రెజ్లర్లుగా తీర్చి దిద్దే క్రమాన్ని దంగల్ సినిమాలో చిత్రీకరించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ మహావీర్ సింగ్ పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చర్ఖిదాద్రి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున బబిత ఫొగాట్ పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ప్రధాని పాల్గొని క్యాంపెయిన్ చేశారు. ఇదిలా ఉండగా హర్యానా యాసలో మోదీ మన ఆడపిల్లలే మైనా మగపిల్లల కన్నా తక్కువా అన్న డైలాగ్‌ను సైతం గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి చెందిన యువతులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
మీ గ్రామాల సహకారం లేకుండా తన ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ విజయవంతం కాక పోయేదన్నారు. మహిళల ఆరోగ్యం, ఆత్మగౌరవం, భద్రత తన ప్రభుత్వ ప్రాధామ్యాలని మోదీ స్పష్టం చేశారు. దేశానికి, సమాజానికి, తమ కుటుంబానికి గర్వ కారణంగా నిలుస్తున్న మహిళలకు రాబోయే దీపావళి పండుగను అంకితమివ్వాలని మోదీ పిలుపునిచ్చారు. నన్ను తిట్టాలనుకుంటే ఎంతైనా తిట్టండి. అవసరమైతే థాయ్‌లాండ్, వియత్నాం..ఎక్కడి నుంచైనా మరిన్ని తిట్లను అరువు తెచ్చుకోండి. నాకేం బాధ లేదు. కానీ అభివృద్ధి పథంలో దూసుకు పోతున్న భారత్‌కు వెన్నుపోటు పొడవకండి అంటూ విపక్షాలకు సూచించారు మోదీ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి