తెలంగాణా దార్శనికుడికి సలాం..!

మహోన్నత మానవుడు ..తెలంగాణ ప్రాంతపు దార్శనికుడు ..కొత్తపల్లి జయశంకర్ సారును స్మరించుకునే వేళ ఇది. ఆయన అడుగులు వేయక పోతే నేడు ఏర్పడిన తెలంగాణ వచ్చి ఉండేది కాదు . అది జగమెరిగిన సత్యం ..వాస్తవం కూడా. 6 ఆగస్తు 1934 లో వరంగల్ జిల్లా అక్కంపేట ఊరిలో పుట్టారు . 2011 లో ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఆయన అందించిన స్ఫూర్తి కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.

ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పలు పుస్తకాలు రచించారు. కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.

బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు.. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా, 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వ విద్యాలయం రిజస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉప కులపతిగా పని చేశారు.అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గ నిర్దేశం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది.

ఆ గడ్డు రోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని నిర్బంధం నుంచి కాపాడారు. హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవడం సర్వ సాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తు పెట్టుకొని పేరు పెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం అంటూ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సారు అనేక పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో సారు పాత్ర మరవ లేనిది. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.

కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్ల ముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది. అయితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని, వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అని అన్న జయశంకర్ ఎప్పటికి తెలంగాణ ప్రజల్లో నిలిచే ఉంటారు. జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన ఆయన లేక పోవడం మనందరి దురదృష్టం..బాధాకరం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!