తోబుట్టువును కోల్పోయిన తెలంగాణ

నిండైన రూపం ..భారతీయత కలిగిన సుష్మా స్వరాజ్ ఇక లేరు. పెదవులపై చెరగని ఆ చిరునవ్వు ను ఇక చూడలేం. ఆమెకు తెలంగాణ ప్రాంతం అన్నా, ఇక్కడి ప్రజలన్నా యెనలేని అభిమానం .. ప్రేమ కూడా . ఇక్కడి నుండి ఢిల్లీకి ఎవరు వెళ్లినా ఆప్యాయంగా పలకరించారు. అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె ఏ నాయకురాలు చేయలేని విధంగా మద్దతు పలికారు. ఇవ్వాళ దేశానికే కాదు తెలంగాణ సైతం పెద్ద దిక్కును కోల్పోయింది. తెలంగాణ ఏ రకంగా మోసపోయిందో , ఎంతటి దోపిడీకి గురైందో , ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలో పార్లమెంట్ సాక్షిగా అద్భుతంగా ప్రసంగించారు . లెక్కలతో సహా విడమర్చి చెప్పారు. ఎన్నో సార్లు ఆమె తెలంగాణ ఉద్యమాన్ని చూసి చలించి పోయారు . పిల్లలు , ప్రజలు చేస్తున్న పోరాటానికి బేషరతుగా మద్దతు పలికారు .

బీజేపీకి తీరని లోటు . ఇటీవల అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు . అంతా చిన్నమ్మ అంటూ పిలుచుకునే సుష్మా స్వరాజ్ ఇక లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నారు వేలాది మంది. ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళు కన్నీటి పర్యంత మవుతున్నారు . ఢిల్లీ ముఖ్యమంత్రిగా , మాజీ కేంద్ర మంత్రిగా , బీజేపీ సీనియర్ నేతగా ఎన్నో సేవలు అందించారు . ఈ సమయంలో ఆమెను తలుచుకోకుండా ఉండలేం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు..ఎప్పటికీ ఉంటారు కూడా. వీళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు .

జయశంకర్ , జైపాల్ రెడ్డి , సుష్మా స్వరాజ్ ఈ ముగ్గురు తెలంగాణ కోసం ప్రత్యక్షంగా ..పరోక్షంగా తమ వంతు పాత్రను పోషించారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని ఒకరు అంకితం చేస్తే మరొకరు ..ఎగువ, దిగువ సభల్లో తమ డైన శైలిలో వివరించారు . సుష్మా ను తెలంగాణ వాసులు చిన్నమ్మగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ కు దేశ రాజధానిలో ..తమకంటూ ..తమ వైపు తమ గోడును వినిపించే వాయిస్ ను కోల్పోవడం బాధాకరం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆమెలాంటి నాయకురాళ్లు అరుదుగా కనిపిస్తారు ఈ దేశంలో. నిండైన భారతీయతకు నిలువుటద్దం లా నిలిచారు. పదునైన మాటలతో ప్రత్యర్థులు సైతం విస్తు పోయేలా ప్రసంగించే వాగ్ధాటి ఆమె స్వంతం. ఆమెకు కన్నీళ్లతో నివాళులు అర్పించడం తప్ప. అవును తెలంగాణ తోబుట్టువును కోల్పోయింది . ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. 

కామెంట్‌లు