గోదావరి కన్నెర్ర .. కుండపోత ..గుండెకోత ..!

నిన్నటి దాకా వానల కోసం ఎదురు చూసిన జనానికి ఇప్పుడు ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వరహాసాలకు వాగులు , కుంటలు , వంకలు పొంగి పొర్లుతున్నవి . జలాశయాలు నీళ్లతో కళకళలాడుతున్నవి. ఇక గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది . పలు గ్రామాలు జల దిగ్భంధం లో చిక్కుకున్నాయి . జనం సాయం కోసం అల్లాడుతున్నారు . ఓ వైపు ఏపీ మరో వైపు తెలంగాణాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం గ్రామం పూర్తిగా నీట మునిగింది . మరో వైపు ప్రాణహిత, శబరి, సీలేరు నదులు ఉప్పొంగడంతో  గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది .భద్రాచలం వద్ద 46.10 అడుగులకు వరద నీరు చేరుకోవడం తో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు .

ఇది మరింత పెరిగే అవకాశం ఉంది .  ఇంకో వైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేపై రెండు అడుగుల ఎత్తున గోదావరి వరద ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.2 అడుగులకు జలాలు చేరాయి . వరద నీరు మరింత పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు . తెలంగాణ లో ప్రవేశించే  కృష్ణా నదిలో భారీగా  వరద. నీరు వచ్చి చేరుతుండడంతో . శ్రీశైలంలోకి 2.1 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు . కర్ణాటక లోని ఆల్మట్టి.. నారాయణపూర్‌ల నుంచి భారీఎత్తున వరద నీరు దిగువకు విడుదల చేశారు . దీంతో జూరాల నిండుకుండలా మారింది . నిన్నటి దాకా చుక్క నీరు లేని జూరాల ఇప్పుడు జలకళ ను సంతరించుకుంది.  గోదావరి వరద ఉగ్రరూపం దాలుస్తుండడంతో ఏజెన్సీ, లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద  13.20 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లోని దేవీపట్నం, వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, కూనవరం, ఏటపాక, చింతూరు, వీఆర్‌పురం మండలాల్లోని గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. 

చిడుమూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇప్పటికే దేవీపట్నం మండలం మొత్తం వరద జలాలతో నిండిపోయింది. విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముంపు గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని, గర్భిణులను పోలవరానికి టూరిజం బోట్లలో తరలించారు. వరద ఉధృతంగా పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు పోలవరంలోని షెల్టర్లకు తరలిరావాలని అధికారులు చెప్పినప్పటికీ వారు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కోనసీమ కూడా వరద ముంపు బారిన పడింది.  గోదావరి దెబ్బకు వేలాది పంటలు నీట మునగడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 

కామెంట్‌లు