వినియోగం మందగమనం ..ఆదాయం అంతంత మాత్రం..!

ఏదైనా ఆదాయం పొందాలంటే వినియోగం అన్నది తప్పనిసరి. వ్యవస్థలో నగదు లభించక పోవడం కూడా మరో కారణం. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం నెలకొనడం తో షేర్లలో భారీ నష్టాలు చవిచూశాయి . కొంత కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏ దేశమైన అభివృద్ధి సాధించాలంటే ..ఆర్థికంగా మరింత బలంగా ఉండాలి. దీనికి చోదక శక్తి వినియోగ రంగం. మన దేశ ఆర్ధిక రంగం మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది . దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది.
భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్‌ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బ తీశాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి నశించింది. నోట్ల రద్దు భారతీయ ఆర్ధిక రంగాన్ని కోలుకోలేకుండా చేసింది. దీంతో నిరుద్యోగం పెరిగింది . ఉద్యోగిత తగ్గింది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎక్కడ చూసినా జనంలో భయం పెరిగి పోయింది . ఆర్ధిక నేరాలు పెరిగి పోయాయి.
కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ 5.7 శాతం పడి పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్‌ ఇండెక్స్‌ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ–50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్‌ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్‌బీఎఫ్‌సీ విభాగమే తీరుస్తోంది. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019–20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7%గా పేర్కొనడం గమనార్హం. డిమాండ్‌ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్‌ తెలిపింది.
కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్‌, వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది . ఇక కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 2019–20లో తొలి త్రైమాసికం లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్‌ రంగం కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది . వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్న నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి పుంజుకోక పోవచ్చన్నది నిపుణుల అంచనా.

కామెంట్‌లు