చెక్ పవర్ కోసం పోరాటం .. సర్పంచులు గరం గరం

గ్రామ పంచాయితీల ఎన్నికలు ముగిసినా సమస్యల పరిష్కారం మాటేమిటో కానీ ..భాద్యత కలిగిన సర్పంచులు రోడ్డెక్కారు. తమకు న్యాయం కావాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు . ప్రస్తుత తెలంగాణ సర్కార్ తీరుపై .. తీసుకున్న నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ప్రధాన రహదారుల పై నిరసనలు , ధర్నాలు చేపడుతున్నారు. దీంతో పోలీసులకు మరింత పని పెరిగింది. ఇప్పటికే గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి . నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా గ్రామాలలో సమస్యలతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు . గతంలో డ్రా చేసే అధికారం ..నిధులు ఖర్చు పెట్టే పవర్ ఆయా గ్రామాల సర్పంచులకు ఉండేది . ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ చెక్ పవర్ ను తీసి వేసింది . సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కు ఇద్దరికీ అధికారం ఉండేలా చట్టంలో మార్పులు తీసుకు వచ్చింది . 

ఉన్న చెక్ పవర్ తీసి వేస్తే తమకు గ్రామాల్లో ఎవరికీ పనికి రాకుండా పోతామని , తమ మాట ఎవరూ వినరని ప్రస్తుతం ఎన్నికైన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . గ్రామం అభివృద్ధి చెందాలన్నా , ఏ పనులైనా కావాలన్నా ముందు ఆ గ్రామ సర్పంచ్ కీలకం. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎలాగో ..పల్లెకు మొదటి పౌరుడు సర్పంచ్. దీంతో అతడు లేదా ఆమెకు ఉన్న అధికారం పంచాయతీరాజ్ చట్టంలో ఇప్పటికే పొందు పరచబడి ఉన్నది . తాము చెక్ పవర్ తమకే ఉండేలా మార్పు చేసేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదంటూ సవాల్ విసురుతున్నారు . అంతే కాకుండా సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు . 

జాయింట్ చెక్ పవర్ రద్దు చేసేంత దాకా తమ ఆందోళనలు , నిరసనలు , ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు . తాజాగా సీఎం పర్యటన సందర్బంగా పాలమూరు జిల్లా జడ్చర్లలో ముందస్తుగా సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు . దీంతో వారి తీరుపై మరింత కోపోద్రిక్తులయ్యారు. భారీ బందోబస్తు చేశారు . ఈ మేరకు ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు . అక్కడ పోలీసులు మోహరించారు. తమను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారని , తమకే మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇక గ్రామాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటూ ..వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ..ఇలాగే ప్రభుత్వం వ్యవహరిస్తే తాము ఊరుకోబోమంటూ హెచ్చరించారు . మొత్తం మీద సర్కార్ తీసుకున్న నిర్ణయం గ్రామాలలో చిచ్చు పెట్టేలా ఉందని మరికొందరు వార్డు సభ్యులు వాపోయారు. ఇప్పటికే ఎన్నికల పేరుతో అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయి . ఉన్నదొక్క గ్రామీణ వ్యవస్థ కూడా మళ్ళీ మొదటికి వచ్చింది . 

కామెంట్‌లు