ప్ర‌భుత్వ బ్యాంకుల్లో దొంగ‌లు ప‌డ్డారు - స్ప‌ష్టం చేసిన ఆర్బీఐ - ప్ర‌జ‌ల సొమ్ము ప‌రుల పాలు

రుణాలు మంజూరు చేసే విష‌యంలో రైతుల‌ను, సామాన్యుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టే ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు ప్ర‌జ‌ల సొమ్మును ప‌రుల‌పాలు చేశాయి. ఈ విష‌యాన్ని సాక్షాత్తు భార‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు, బ్యాంకుల‌కు క‌ష్టోడియ‌న్‌గా భావించే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. ల‌క్ష‌లు కాదు ఏకంగా 71 వేల 500 కోట్ల రూపాయ‌ల మేర మోసం జ‌రిగిందంటూ స‌మ‌చార హ‌క్కు చ‌ట్టం కింద అడిగిన ప్ర‌శ్న‌కు జవాబు ఇచ్చింది. ఇంత‌గా లెక్క‌లేనంత‌గా మోసాలు జ‌రిగినా ఈ బ్యాంకులు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే గ‌తంలో మోదీ స‌ర్కార్ తీసుకున్న నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వ బ్యాంకులంటేనే న‌మ్మ‌కం పోయింది.

బ్యాంకుల్లోని చ‌ట్టాల‌లో నెల‌కొన్న లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని అక్ర‌మార్కులు అప్ప‌నంగా డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని తెలిపింది. ఇలాంటి మోసాల‌కు దిక్కు లేకుండా పోయింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 6 వేల 800 మోసాలు జ‌రిగాయ‌ని, వీటి విలువ సుమారు 71 వేల కోట్ల‌కు పైమాటేన‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌కు ముందు ఏడాది అంటే 2017-18లో 5 వేల 916 కేసులు న‌మోదు కాగా వాటి కార‌ణంగా బ్యాంకులు 41 వేల కోట్ల పైగా న‌ష్ట‌పోయాయి. 2017 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ఈసారి మోసాల సంఖ్య73 శాతానికి పెరిగింది. ఇది ప్ర‌మాద సూచిక‌ను సూచిస్తోంది. గ‌త 11 ఏళ్ల‌లో బ్యాంకుల్లో ఆర్థిక సంస్థ‌ల్లో మోసాల‌పై 53 వేల 334 కేసులు న‌మోదు చేశారు.

దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఆర్థిక న‌ష్టం వాటిల్లింది ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు. 2008-2009 లో 1860 కోట్లు కోల్పోగా, 4 వేల 372 కేసులు న‌మోద‌య్యాయి. 2009-10లో 1998 కోట్ల నిధులు గోల్ మాల్ కాగా, 4 వేల 669 కేసులు న‌మోద‌య్యాయి. 2010-11 ఆర్థిక సంవ‌త్స‌రంలో 4 వేల 534 కేసులు న‌మోదు కాగా బ్యాంకులు 3 వేల 815 కోట్లు న‌ష్ట‌పోయాయి. 2012 ఆర్థిక సంవ‌త్స‌రంలో 4 వేల 235 కేసులు న‌మోదు కాగా ..8 వేల 590 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింది బ్యాంకుల‌కు. 2014లో భారీగా బ్యాంకుల‌కు న‌ష్టం వాటిల్లింది. 19 వేల 455 కోట్లు న‌ష్ట‌పోయాయి. 4 వేల 639 కేసులు న‌మోదు అయ్యాయి.

2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో 5 వేల 76 కేసులు న‌మోదు కాగా 23 వేల 933 కోట్ల మేర న‌ష్ట‌పోయాయి బ్యాంకులు. బ్యాంకుల్లో మోసాలు జ‌రిగిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే అదికారులు ఫిర్యాదులు చేయాల‌ని, ఆవిష‌యాన్ని ఆర్బీఐకి తెలియ చేయాల‌ని సూచించింది. అయినా ఈ రోజు వ‌ర‌కు దానిపై స్పందించిన దాఖ‌లాలు లేవు. ఈ మోసాల వెనుక బ్యాంకులోని ఇంటి దొంగ‌ల ప‌ని కూడా ఉంద‌న్న అనుమానాలు లేక పోలేదు. ఏది ఏమైనా ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి దాచుకున్న డ‌బ్బుల‌ను ఇలా ప‌రుల‌పాలు చేస్తే ఉన్న న‌మ్మ‌కం కాస్తా ఊడిపోతుంది. ఇప్ప‌టికైనా కేంద్ర స‌ర్కార్ త‌క్ష‌ణ‌మే స్పందించి ఆర్బీఐ జూలు విదిల్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.

కామెంట్‌లు