పెరుగుతున్న నిరుద్యోగం - పట్టించుకోని ప్రభుత్వం
నీళ్లు, నిధులు , నియామకాలు పేరుతో సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన తెలంగాణలో ఇపుడు నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అంటున్నారు. తమ ప్రాంతానికి స్వేచ్ఛ లభిస్తే, తమకంటూ స్వయం పాలన వస్తే బతుకులు బాగు పడతాయని కలలు కన్న లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఇపుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కాంట్రాక్టు ఎంప్లాయిస్‌కు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడది నీటి మూటగానే మిగిలింది. దాదాపు 2 లక్షల 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వివిధ డిపార్లమెంట్లలో ఇప్పటికీ పని భారంతో ఇతర సిబ్బంది లెక్కకు మించి పని చేస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ..ఏకంగా రెవిన్యూ డిపార్ట్‌మెంట్ ను ఇతర శాఖలోకి మార్చేస్తానంటూ ప్రకటించారు. దీంతో ఆ శాఖకు చెందిన ఉద్యోగులు, సిబ్బందిలో అభద్రతా భావం నెలకొంది. విపక్షాలతో పాటు నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ఖాళీలను భర్తీ చేయమని కోరుతున్నాయి. అయినా ఈరోజు వరకు సర్కార్ స్పందించడం లేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. కొలువులకు సంబంధించి ప్రకటనలు వచ్చినా పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది.
దీంతో టీఆర్‌టీ అభ్యర్థులు ఏకంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టారు. కనీసం కాంట్రాక్టు పద్ధతిలోనైనా ఖాళీలను నింపుతారని ఆశిస్తే దానిపై సర్కార్ నీళ్లు చల్లింది. ఇంకో వైపు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగులు పెరుగుతూ వస్తున్నారు. ఈ విషయం ఇటీవల జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాల ర్యాంకింగ్స్ ను విడుదల చేశారు. మన రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. ఉద్యోగాలను కల్పించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కప్పదాటు ధోరణిని అవలంభిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అన్ ఎంప్లాయిమెంట్ రేటు ఏకంగా 12.4 శాతంగా వుంటే..అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో మనం ఆరు దగ్గర ఉన్నామంటే అర్థం చేసుకోవచ్చు ఏస్థితిలో నిరుద్యోగం ఉందో. విద్యార్థుల పరంగా చూస్తే..ఉన్నత విద్యా పరంగా చూస్తే 15.7 శాతం, డిప్లొమా స్థాయిలో 21.2 శాతం, అండర్ గ్రాడ్యూయేట్స్ లో 38.5 శాతం, పీజీ, ఆపై చదువులు చదివిన వారి సంఖ్య చూస్తే 43. 7 శాతంగా ఉంది. నిరుద్యోగులు ఉన్న రాష్ట్రాల్లో టాప్ టెన్‌లో మనకు చోటు దక్కడాన్ని మేధావులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
నీళ్లు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రస్తుత సర్కార్ నిరుద్యోగులను పూర్తిగా పక్కన పెట్టింది. ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా..నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అధికారికంగా లెక్కలతో సహా వాస్తవాలను వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే మొదటి స్థానంలో యుపీ, రెండో స్థానంలో ఒడిశా, మూడో స్థానంలో ఉత్తరాఖండ్, నాలుగో స్థానంలో జమ్మూ కాశ్మీర్, ఐదో స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో చదువుకున్న వారే అత్యధికంగా తెలంగాణలో ఉండడం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి