మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం - ఆప్ అసాధార‌ణ నిర్ణ‌యం - 700 కోట్ల ఖ‌ర్చు

మ‌హిళా సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి చెబుతూ వ‌స్తోంది. ఆ దిశ‌గా అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 7 లోక్‌స‌భ సీట్ల‌ను ఆప్ కోల్పోయింది. అన్ని సీట్ల‌లో క‌మ‌లం కాషాయ జెండాను ఎగుర వేసింది. మొద‌ట్లో కాంగ్రెస్‌తో దోస్తీ క‌ట్టాల‌ని నిర్ణ‌యించినా ఎందుక‌నో కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఏదో రకంగా మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ఆప్ అధినేత కేజ్రీవాల్ శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేశారు కేజ్రీ. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ..ఏరాష్ట్రంలో లేని విధంగా మ‌హిళంద‌రికి మెట్రో రైళ్ల‌లో, ప్ర‌భుత్వ బ‌స్సుల్లో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ప్ర‌యాణం చేసినా ఉచితమేనంటూ ప్ర‌క‌టించారు. 

మ‌రో రెండు నెల‌ల్లో ఈ స్కీం అమ‌లు లోకి వ‌స్తుంద‌ని సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. త‌క్ష‌ణ‌మే ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగారు. విధివిధానాల‌ను రూపొందించే ప‌నిలో ప‌డ్డారు. ఈ నిర్ణ‌యంతో వేలాది మంది మ‌హిళ‌లు, బాలిక‌లు, వృద్దుల‌కు ల‌బ్ధి క‌లుగుతుంది. ఢిల్లీ వ్యాప్తంగా మెట్రోలు, బ‌స్సులు నిత్యం ప్ర‌యాణికుల‌ను చేర వేస్తుంటాయి. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కాలేజీలు, ఇత‌ర ప‌నుల నిమిత్తం ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణాలు సాగిస్తుంటారు. స్థానికంగా ఢిల్లీలోనే స్థిర నివాసం ఏర్ప‌ర్చుకుని వ్యాపారాలు నిర్వ‌హించే వారికి, ఉద్యోగాలు చేసుకునే వారితో పాటు చ‌దువుకునే స్టూడెంట్స్ కు ఈస్కీం మంచి ఉప‌యోగ‌కారిగా ఉంటుంది. 

ఆప్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో భారీ ఎత్తున మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది. ఇదంతా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఇలాంటి చౌక‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారంటూ విప‌క్షాలు ముఖ్యంగా అధికార బీజేపీ స‌ర్కార్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ (డిఎంఆర్‌సీ) తో పాటు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేష‌న్ (డిటీసీ)ల‌తో అత్య‌వ‌స‌ర భేటీ కానున్నారు కేజ్రీవాల్. మ‌హిళలకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో భాగంగానే అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌నున్నామ‌ని, దీంతో పాటు వారికి అనువుగా ఉండేలా ఉచిత ప్ర‌యాణం కూడా చేర్చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కం ప్ర‌స్తుత స‌ర్కార్‌కు అద‌నంగా 700 కోట్ల ఖ‌ర్చు కానున్న‌ట్లు అధికారుల అంచ‌నా. దీనిని ఎట్లా రిక‌వ‌రీ చేస్తార‌నే దానిపై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంది. 

ఇదిలా ఉండ‌గా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను కేజ్రీవాల్ తేలిగ్గా కొట్టి పారేశారు. మ‌హిళ‌ల కోసం ఏ స్కీంనైనా అమ‌లు చేసేందుకు ఆప్ సిద్ధంగా ఉందంటూ ప్ర‌క‌టించారు. ఆరు నెల‌ల కాలానికి 700 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని దీనిని అధిగ‌మించేందుకు త‌మ వ‌ద్ద స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక ఉందంటూ తెలిపారు. డిఎంఆర్ సీకి 2 వేల 800 కోట్ల‌కు పైగా ఆదాయం స‌మ‌కూరుతోంది. డిటీసీ కూడా ఆదాయాన్ని గ‌డిస్తోంది. ఈ రెండు సంస్థ‌ల ద్వారా వ‌చ్చే ఆదాయంలో నుంచే మ‌హిళ‌ల‌కు అయ్యే ఖ‌ర్చు ను మిన‌హాయించాల‌ని యోచిస్తుంది ఆప్ స‌ర్కార్. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌హిళా ఓట్లు ఆప్ వైపు మ‌ళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. 

కామెంట్‌లు