హ‌మ్మ‌య్య‌..బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విప్ర‌కాష్

టీవీ9 వ్య‌వ‌స్థాప‌కుడిగా , బ్రాడ్‌కాష్టింగ్ జ‌ర్న‌లిస్ట్ గా పేరొందిన ర‌విప్ర‌కాష్ ఎట్ట‌కేల‌కు మౌనం వీడారు. ఎన్నో ట్విస్టులు..అనుమానాలకు పుల్ స్టాప్ పెడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌న కొంత కాలం పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ర‌విప్ర‌కాష్ ను ప‌ట్టుకునేందుకు హైద‌రాబాద్ సీపీ పోలీసులు గాలింపులు చేప‌ట్టారు. అయినా ఈ మీడియాధిప‌తి చిక్క‌లేదు. ఆ మ‌ధ్య కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. త‌న‌ను కావాల‌ని ఇరికించార‌ని, తాను నిబ‌ద్ధ‌త క‌లిగిన జ‌ర్న‌లిస్టునంటూ..స‌మాజ హితం కోస‌మే ప‌నిచేస్తున్నానని చెప్పారు. కానీ పోలీసులు  మాత్రం త‌మ ప‌ట్టు వీడ‌లేదు. ఎందుక‌నో ఇంత డ్రామా న‌డిచింది. కేసులు న‌మోదు చేసిన‌ప్పుడే ..సీపీ ఎదుట హాజ‌రై వుంటే ఇంత త‌తంగం జ‌రిగి ఉండేది కాదు. స్టోరీ మేకింగ్‌లో కింగ్ మేక‌ర్‌గా, వేలాది మందిని ఇంట‌ర్వ్యూ చేసిన ఈ జ‌ర్న‌లిస్టు చివ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు, వివ‌ర‌ణ ఇచ్చేందుకు నానా తాత్సారం చేశారు. దీనిపై సీనియ‌ర్లు ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్టారు.

అజ్ఞాతం వీడిన ర‌విప్ర‌కాశ్ ..సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైం ఠాణాలో పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌య‌మే వ‌స్తాన‌ని ముందస్తుగా స‌మాచారం ఇవ్వ‌డంతో ఇన్వెస్టిగేషన్ సులువైంది. అంత‌కు ముందు ఈ జ‌ర్న‌లిస్టు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ ఆయ‌న‌కు చుక్కెదురైంది. ఎంత జ‌ర్న‌లిస్టువైనంత మాత్రాన చ‌ట్టం చ‌ట్ట‌మే. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే. నీ స‌మ‌స్య చిన్న‌ది..ఇది రాష్ట్రంలోని హైకోర్టులోనే తేల్చుకోవాలి. ఇక్క‌డి దాకా రాకూడ‌దంటూ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. స‌మాజ హిత‌మంటూ ఆయ‌న ఎన్నో ప్ర‌వ‌చ‌నాలు ప‌లికారు. వీడియోలు విడుద‌ల చేశారు. ఆశించినంత స్పంద‌న రాలేదు. గ‌ద్ద‌ర్ ను కూడా వాడారు. ఇవాళ ఆ గాయ‌క యుద్ధ‌నౌక‌..కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఇంత‌గా సాగ‌దీసే బ‌దులు డైరెక్ట్‌గా విచార‌ణ‌కు హాజ‌రై వుంటే బావుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆయ‌న సూచించిన ఉద‌యం వేళ‌ల్లో అధికారులు లేక పోవ‌డంతో సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఠంఛ‌నుగా ఠాణా ముందు ద‌ర్శ‌న‌మిచ్చారు. సైబ‌ర్ క్రైం ఏసీపీ శ్రీ‌నివాస్ కుమార్ తో పాటు ఇన్స్ పెక్ట‌ర్ల బృందం ర‌విప్ర‌కాష్ ను సుదీర్ఘంగా విచారించింది. టీవీ9 సంస్థ వాటాల వివాదంలో అలందా మీడియా యాజ‌మాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు సైబ‌ర్ క్రైం పోలీసులు కొద్ది రోజుల కింద‌ట కేసు న‌మోదు చేశారు. నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ర‌విప్ర‌కాశ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. త‌మ ముందు హాజ‌రు కావాల‌ని 160 సిఆర్పీసీ, రెండు సార్లు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినా స్పందించ‌లేదు. ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ త‌ర్వాత కోర్టుకు వెళ్లినా ఫ‌లితం లేక పోవ‌డంతో ర‌వి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

విచార‌ణ అనంత‌రం ర‌విప్ర‌కాష్ మౌనం వీడారు. మీడియాతో మాట్లాడారు. టీవీ9ను ఇద్ద‌రు ధ‌నికులు అక్ర‌మంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. త‌న‌పై దొంగ కేసులు పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బోర్డు స‌మావేశం ఏర్పాటు చేసి..అక్ర‌మంగా త‌న‌ను టీవీ9 నుంచి బ‌య‌ట‌కు పంపించి వేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాన‌ని, మాఫియాకు మీడియాకు మ‌ధ్య జ‌రుగుతున్న ధ‌ర్మ యుద్ధంగా అభివ‌ర్ణించారు. ఈ వార్‌లో అంతిమంగా జ‌ర్న‌లిజ‌మే గెలుస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాగా ఎట్టి ప‌రిస్థితుల్లోను ర‌వి ప్ర‌కాష్ ను అరెస్ట్ చేస్తార‌నే వార్త‌లు గుప్పుమనడం విశేషం. ఇదే ర‌విప్ర‌కాశ్ ..తెలంగాణ ఉద్య‌మానికి ఏనాడూ స‌పోర్ట్ చేయ‌లేదు. త‌న‌ను తాను గొప్ప జ‌ర్న‌లిస్టుగా భావించుకునే స‌ద‌రు మీడియా అధిప‌తి ..కాలం ఏ ఒక్క‌రి స్వంతం కాద‌ని తెలుసుకుంటే మంచిది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!