స్టాలిన్ ఆగ్రహం ..దిగొచ్చిన రైల్వే యంత్రాంగం
ఏదైనా సాధించాలన్నా..తమ దారికి తెచ్చు కోవాలన్నా..అనుకున్న పని కావాలంటే ..పక్కనే వున్న తమిళులను చూసి నేర్చుకోవాలి. ఈ దేశంలో వారికి వున్నంత భాషాభిమానం..ప్రాంతీయ అభిమానం ఇంకెవ్వరికి లేదంటే అతిశయోక్తి కాదేమో. కేంద్రంలో థంబింగ్ మెజారిటీతో కొలువుతీరిన మోదీ, షా సర్కార్ తమకు తోచిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. బిజిపేయేతర రాష్ట్రాలలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన కల్చర్, సివిలైజేషన్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. తాజాగా హిందీ భాషను రెండో భాషగా తప్పనిసరిగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై పలు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన స్టాలిన్ నిప్పులు చెరిగారు.
మీ పెత్తనం మామీద కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర సర్కార్ దిగొచ్చింది. రాష్ట్రాలను సంప్రదించాకే అమలు చేస్తామని , ఆదేశాలు వెనక్కి తీసుకుంటున్నామని విద్యా శాఖ మంత్రి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరో వివాదానికి తెర లేపింది ..రైల్వే శాఖ. తమిళులకు భాషాభిమానం ఎక్కువ అన్న విషయం ఆ శాఖధికారులకు తెలుసు. అయినా పులితో గోక్కోవడం ఎందుకని అనుకోలేదో అర్థం కాలేదు. చాలా సందర్భాలలో తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినా తమ ప్రాంతానికి అన్యాయం జరిగినా వీరు మౌనంగా ఉండలేరు. తక్షణమే స్పందిస్తారు. తమ నిరసనను వ్యక్తం చేస్తారు. తాజాగా వారి మాతృభాషపై మమకారం మరోసారి బయట పడింది.
తమ పరిధిలో పనిచేస్తున్న స్టేషన్ మాస్టర్లు, సిబ్బంది ఉత్తర ప్రత్యుత్తరాలను హిందీ లేదా ఆంగ్ల భాషలో మాత్రమే రాయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ విషయం డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ దాకా వెళ్లింది. ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తక్షణమే జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించు కోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో అధికారులు దిగి వచ్చారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. గత నెలలో సర్కులర్ జారీ చేసింది. స్టేషన్ మాస్టర్స్, లోకో పైలట్లు, సిబ్బంది శాఖాపరమైన సమాచారాన్ని స్థానిక భాషలో కాకుండా హిందీ లేదా ఇంగ్లీష్ లోనే బట్వాడా చేయాలని దాని సారాంశం.
ఈ అంశాన్ని సదరన్ రైల్వే మజ్దూరి యూనియన్ వ్యతిరేకించింది. తమిళనాడులో హిందీ ప్రాధాన్యతను పెంచేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. అధికారులను నిలదీయడం..ఆ విషయం స్టాలిన్‌కు చేరడం..ఆయన మందలించడం చకా చకా జరిగి పోయింది. ఇలాంటి అనవసరమైన ఉత్తర్వులు జారీ చేయడం మానుకోవాలని..మరోసారి జరిగితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదీ తమిళుల పవర్ అంటే..వీరిని చూసి తెలుగు వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి