దివ్య సాకేత క్షేత్రం - ఆధ్యాత్మిక సౌర‌భం..ఆనంద‌పు స‌మీరం ..!

నిర్మ‌ల‌మైన ప్ర‌శాంతత కావాలంటే. అల్ల‌క‌ల్లోల‌మైన మ‌న‌సు సేద దీరాలంటే. దుఖఃం నుంచి విముక్తి పొందాలంటే. గుండెల్లో ప్రేమ మొలకెత్తాలంటే..స‌మ‌స్త శ‌రీరం ఆధ్యాత్మిక లోగిలిలో సేద దీరాలంటే..హృద‌యం పునీతం కావాలంటే ఏం చేయాలి. జేబుల నిండా క‌రెన్సీ వుండాల్సిన ప‌నిలేదు. ఆస్తులు, అంత‌స్తులు, హోదాలు, వాహ‌నాల‌తో ప‌ని లేదు. ఎలాంటి ఖ‌ర్చు అక్క‌ర్లేదు. కావాల్సింద‌ల్లా భ‌క్తిని క‌లిగి వుండ‌ట‌మే. ఎదుటి వారి ప‌ట్ల మ‌మ‌కారం వుండ‌ట‌మే. స‌మ‌స్త ప్ర‌పంచంతో మీకు ప‌ని లేదు. ప‌రిచ‌యం అంత‌క‌న్నా అక్క‌ర్లేదు. విజ్ఞానం కావాలంటే..జ్ఞానం పొందాలంటే..చెమ‌ట చుక్క‌లు చిందించాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. జ‌స్ట్..మిమ్మ‌ల్ని మీరు ప్రేమించు కోవ‌డం. మీ ప‌రిమితులు ఏమిటో మీరు తెలుసు కోవ‌డం. దీనికి ప్ర‌త్యేక‌మైన సాధ‌న , కఠోర దీక్ష కూడా అక్క‌ర్లేదు. జ‌స్ట్..సంక‌ల్ప బ‌లం క‌లిగి వుంటే చాలు. మీలో మీరు ఊహించ‌ని శ‌క్తి మిమ్మ‌ల్ని ఆవ‌హిస్తుంది. ఎక్క‌డా దొర‌క‌ని అనుభూతికి మీరు లోన‌వుతారు. ఇదంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ రామానుజ స్వామీజీని ద‌ర్శించుకుంటే ..స్వామి వా
రు స్వ‌హ‌స్తాల‌తో అందించే తీర్థం తీసుకుంటే క‌లుగుతుంది.

ప్ర‌తి రోజు ఎంతో కొంత డ‌బ్బు ఖ‌ర్చ‌వుతూనే వుంటుంది. ఎన్నో వ్య‌స‌నాల కోసం లెక్క‌కు మించి ఖ‌ర్చు చేస్తాం. కానీ ఎంద‌రికో నీడ‌నిచ్చి ..ఎన్నో ఆశ్ర‌మాలు నిర్వ‌హిస్తూ ..ఆధ్యాత్మిక ప్ర‌చారంతో పాటు ..స‌ర్వ జ‌నులంతా సుఖ సంతోషాల‌తో వుండాల‌ని నిత్యం ప‌రిత‌పించే ఆధ్యాత్మిక గురువును సంద‌ర్శిస్తే చాలు. జీవితం ధ‌న్య‌మై పోతుంది. ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌తి అంశం గురించి శ్రీ స్వామి వారు అన‌ర్ఘ‌లంగా ప్ర‌సంగిస్తారు. జ్ఞాన ప్ర‌వాహంలోకి తీసుకు వెళ‌తారు. ఈ నేల‌..ఈ ఆకాశం..ఈ ప్ర‌పంచం పోక‌డ ..వాటి అడుగుల గురించి విడ‌మ‌ర్చి చెబుతారు. అంకెలు, సంఖ్య‌ల‌తో స‌హా అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తారు. ఇది ఆయ‌న‌కు మాత్ర‌మే ప్ర‌త్యేకం. స్వామి వారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. జ‌గ‌మంత కుటుంబం త‌న‌ది. పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుంటారు. వారికి విద్యా బుద్దులు నేర్పిస్తారు. వీరి కోసం ప్ర‌త్యేకంగా బ‌డులున్నాయి. ముఖ్యంగా పేద‌పిల్ల‌లు త‌మ కుటుంబం కంటే ఇక్క‌డే వుండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. చూపు లేని వారి కోసం ప్ర‌త్యేక లిపిని త‌యారు చేశారు. వారికి నిరంత‌రం శిక్ష‌ణ ఇస్తూనే వుంటారు. ఇక్క‌డ చ‌దివే వారంతా ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ..ఏ మూల‌న వున్నా బ‌తికేలా వుండాల‌ని అంటారు జ‌గ‌ద్గురు.

44వ జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌తి రోజూ వేలాది వాహ‌నాలు వ‌స్తూ వెళుతుంటాయి. శంషాబాద్ లోని జిఎంఆర్ విమానాశ్ర‌యంకు అతి ద‌గ్గ‌ర‌లో ముచ్చింత‌ల్ గ్రామ స‌మీపంలో..శ్రీ శ్రీ శ్రీ చిన్న‌జీయ‌ర్ రామానుజ స్వామి వారి ఆధ్వ‌ర్యంలో ఆశ్ర‌మం కొలువై వుంది. ఇక్క‌డ శ్రీ స్వామి వారు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో తీర్థ , ప్ర‌సాదాలు అంద‌జేస్తారు. తెలంగాణ‌లోనే అద్భుత‌మైన హోమియోప‌తి కాలేజీ ఉంది. దీంతో పాటే భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ..క‌ల‌ల పంట స్వ‌ర్ణ భారతి ట్ర‌స్ట్ ఇక్క‌డే ఏర్పాటు చేశారు. నిరంత‌రం వివిధ రంగాల‌కు సంబంధించి శిక్ష‌ణ ఇస్తారు. దాని ప‌క్క‌నే త‌క్కువ ధ‌ర‌లోనే ఆస్ప‌త్రి. దాని త‌ర్వాత ఆశ్ర‌మానికి దారి. మొద‌ట గోశాల ద‌ర్శ‌నం క‌లుగుతుంది. స్వామి వారు వ‌చ్చేస‌రిక‌ల్లా అవ‌న్నీ లేచి నిల‌బ‌డ‌తాయి. ఆయ‌న సాక్షాత్తు ఆధ్యాత్మిక‌త క‌లిగిన ..నిండిన గురువు. అంత‌టి శ‌క్తి సంప‌న్నులు కాబ‌ట్టే..వేలాది మంది భ‌క్తులుగా మారి పోయారు. ఇక్క‌డ కుల‌,మ‌తాలు, వ‌ర్గాలంటూ వుండ‌వు. మ్యూజియం , భారీ ఆల‌యం, దాని ప‌క్క‌నే ఉచితంగా వైద్య సేవ‌లు. వుండేందుకు వ‌స‌తి గృహాలు, కుటీరం, ఆ ప‌క్క‌నే వేద పాఠ‌శాల‌, అంధుల‌కు ల్యాప్ టాప్‌ల‌పై ట్రైనింగ్. నిరంత‌రం కొన‌సాగుతూనే వుంటుంది.

ఎవ‌రినీ కాద‌నరు. ముందుగా పిల్ల‌లు లైన్లో నిల్చుంటారు. వారికి తీర్థం ఇచ్చాక‌. త‌న కోసం వేచి వుండే భ‌క్తుల‌కు అంద‌జేస్తారు. మంగ‌ళాశీస్సులు అంద‌జేస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ రామానుజ స్వామి వారికి భ‌క్తులు ఉన్నారు. అంతేనా..ఇత‌ర దేశాల్లో కూడా ఆశ్ర‌మాలున్నాయి. శ్రీ స్వామి వారు అప్పుడ‌ప్పుడు విదేశాల్లో ప‌ర్య‌టిస్తారు. శ్రీ స్వామి వారితో సంభాషించినా లేక ప్ర‌శ్నించినా లేదా అనుమానాలు నివృత్తి చేసుకోవాల‌న్నా ...ఒక జీవితానికి స‌రిప‌డా ప‌రిష్కారం దొరుకుతుంది. అంతులేని సంతోషాన్ని, అద్భుత‌మైన విజ్ఞానాన్ని..అంత‌కు మించి అద్భుతాన్ని మ‌నం చవిచూస్తాం. ఎంద‌రో పీఠాధిప‌తులు వుండి వుండ‌వ‌చ్చు. కాద‌న‌లేం. ఎవ‌రి ప‌రిమితుల్లో వారు ఆధ్యాత్మిక ప‌రంగా సేవ‌లందించ వ‌చ్చు గాక‌..కానీ చిన్న‌జీయ‌ర్ తో అనుబంధం మాత్రం మ‌రో జ‌న్మ‌ను ఎత్తిన‌ట్టే. ఆ భాగ్యం..ఆ అదృష్టం నాకు ద‌క్కినందుకు ఆనందంగా వుంది..అంత‌కంటే గ‌ర్వంగా అనిపిస్తోంది. ఎంతైనా స్వామి వారు జ‌గ‌ద్గురు క‌దూ. గురుభ్యోన‌మః ..జై శ్రీమ‌న్నారాయ‌ణ‌...!

కామెంట్‌లు