జీతాలకు కటకట..అప్పుల ఊబిలో బిఎస్ఎన్ఎల్..!
రాకెట్ కంటే వేగంగా టెలికాం రంగం ఓ వైపు దూసుకెళుతుంటే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ సంస్థ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ పరుగులు తీసేందుకు నానా తంటాలు పడుతోంది. కొన్నేళ్లుగా దేశానికి టెలికాం పరంగా విశిష్ట సేవలు అందించిన ఈ దిగ్గజ సంస్థ ఇపుడు సిబ్బంది, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి దిగజారింది. ప్రభుత్వ పరంగా నవరత్న కంపెనీలు ఓ వైపు ఆదాయం పెంచుకునేందుకు దౌడు తీస్తుంటే..బిఎస్ ఎన్ ఎల్ మాత్రం ఉన్న చోటనే ఉండి పోయింది. ఎప్పుడైతే ట్రాయ్ ప్రైవేట్ టెలికాం ఆపరేట్లర సేవలు అందించేందుకు తెర తీసిందో అప్పటి నుంచి ఈ సంస్థకు గట్టి పోటీ ఏర్పడింది. సరళీకృత ఆర్థిక విధానాల దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలయ్యాయి.
విపరీతమైన పోటీ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా అతి పెద్ద ఫైబర్ కనెక్టివిటీ కలిగిన ఈ సంస్థ ఇపుడు సర్కార్ అందించే సాయం కోసం బేల చూపులు చూస్తోంది. వేలాది మంది సిబ్బంది, ఉద్యోగులు తమ సంస్థను కాపాడుకునేందుకు శ్రమించారు. దానిని నిలబట్టడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంభించింది. నూతన టెక్నాలజీని అందిపుచ్చు కోక పోవడం, ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడక పోవడంతో బిఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలోకి నెట్టి వేయబడింది. లెక్కలేనంత ఆస్తులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో శ్రద్ద చూపించలేదు. ఒక ప్లాన్ అంటూ లేకుండా ప్రభుత్వంపైనే ఆధారపడడంతో దీనిని ఎలాగైనా వదిలించు కోవాలనే ఉద్ధేశంతో ప్రస్తుత సర్కార్ ఆలోచనలో ఉందని సిబ్బందే వాపోతున్నారు. అతి పెద్ద ప్రభుత్వ రంగ కంపెనీగా పేరొందిన ఈ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఈరోజు వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.
మేకిన్ ఇండియా పేరుతో కాలం వెల్లబుచ్చుతున్న మోదీ ప్రభుత్వం , ఉన్నతాధికారులు ఎక్కడ పొరబాటు జరిగిందో, ఎందుకు నష్టాలు వస్తున్నాయో రివ్యూ చేయక పోవడం దారుణం. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో అనారోగ్యకరమైన పోటీకి తెర లేపింది రిలయన్స్ . ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ కొట్టిన దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలతో పాటు బిఎస్ ఎన్ ఎల్ కంపెనీ లబోదిబోమంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థతో పాటు అతి పెద్ద నెట్ వర్క్, కనెక్టివిటీని ఏర్పాటు చేసుకుంది రిలయన్స్ కంపెనీ. ఇప్పటికే అయిదున్నర కోట్ల మంది ఈ సంస్థలో సబ్ స్క్రైబర్స్‌గా చేరడంతో ..అతి పెద్ద టెలికాం ఆపరేటర్‌గా ప్రపంచంలోనే అవతరించింది. ఇది ఓ రికార్డు.
జియో మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ పోతుంటే..మిగతా కంపెనీలు దిక్కు తోచక ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నాయి. భారీ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లు, మైదానంలో ఉన్నా ..లేక అడవికి వెళ్లినా సరే నెట్ వర్క్ పనిచేసేలా..డేటా కనెక్టివిటీ వుండేలా చూస్తోంది జియో. దీంతో ప్రతి ఒక్కరు దీనినే ప్రిఫర్ చేస్తున్నారు. తమ ఓటు దీనికే అంటూ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే 5జి సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. జియో దెబ్బకు బిఎస్ ఎన్ ఎల్ ..ఇపుడు దివాలా అంచున నిలిచింది. గణనీయమైన ఆదాయాన్ని స్వంతం చేసుకున్న ఈసంస్థ రాను రాను టెక్నాలజీతో అప్ డేట్ కాక పోవడం, మితిమీరిన ప్రభుత్వ అధిపతుల జోక్యం, అనాలోచిత నిర్ణయాల కారణంగా నష్టాల పాలైంది. దీంతో దీనినే నమ్ముకున్న లక్షలాది మంది బతుకులు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే 90 వేల కోట్ల అప్పుల్లోకి కూరుకు పోయింది. ఇప్పటికైనా మోదీ సర్కార్ మేల్కొని దీనికి కాయకల్ప చికిత్స చేస్తే గట్టెక్క గలుగుతుంది. లేకపోతే మూసివేతకు దారి తీస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి