విస్తుపోయిన ప్ర‌పంచం - ఎగిరిన మువ్వొన్నెల ప‌తాకం - క‌పిల్ సేన క‌ప్పు సాధించి 36 ఏళ్లు

క్రికెట్ ప్ర‌పంచం విస్తుపోయిన వేళ‌. ప్ర‌తి భార‌తీయుడు గుండె నిండా ..ఈ దేశం నాది ..ఈ క్రిక‌ట్ జ‌ట్టు నాది అని ఫీల్ అయిన వేళ‌. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ..మువ్వెన్నెల భార‌తీయ ప‌తాకం ..స‌గ‌ర్వంగా ఆకాశంలో ఎగిరిన వేళ‌. కోట్లాది జ‌నం హ‌మారా భార‌త్ మ‌హాన్ అని నిన‌దించిన వేళ‌. ఊపిరి బిగ ప‌ట్టి ..హ‌ర్యానా హ‌రికేన్ ..ఫాస్టెస్ట్ ఎక్స్‌ప్రెస్ గా పేరొందిన క‌పిల్‌దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడిన వేళ‌.. కుల‌,మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు క‌పిల్..క‌పిల్ అంటూ వినువీధుల్లో ప‌రుగులు తీసిన వేళ‌..ఆ స‌న్నివేశం ఇప్ప‌టికీ ఇంకా మ‌దిలో మెదులుతూనే వున్న‌ది. స‌మున్న‌త భారతావ‌ని త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. ప్ర‌పంచ జ‌ట్ల‌కు షాక్ ఇస్తూ..ఫైన‌ల్లో వివియ‌న్ రిచ‌ర్డ్స్ నేతృత్వంలోని విండీస్‌ను మ‌ట్టి క‌రిపించి ..విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు ..నిటారుగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను పైకెత్తింది. ఇదిగో మేము సాధించిన అద్భుత‌మైన గెలుపు అంటూ  ప్ర‌క‌టించింది. ఆ స్వ‌ప్నాన్ని నిజం చేసిన రోజు స‌రిగ్గా 1983వ సంవ‌త్స‌రం జూన్ 25.

ఇవ్వాల్టితో స‌రిగ్గా 36 సంవ‌త్స‌రాలు నిండాయి. ఆ ఉద్విగ్న భ‌రిత‌మైన క్ష‌ణాల‌ను అనుభ‌వించిన భార‌తీయుల్లో నేను కూడా ఒక‌డిని. క్రికెట్ అంటే 11 మంది పిచ్చోళ్లు ఆడే ఆట‌..క‌దా అంటూ హేళ‌న చేసిన వాళ్ల నోళ్లు మూయించిన ఘ‌న‌త ..క‌పిల్ దేవ్‌దే. ఆ మ‌హోన్న‌త‌మైన క్రికెట్ దిగ్గ‌జం చివ‌రి వ‌ర‌కు దేశం కోసం ఆడాడు. క‌ప్పుతో ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు అపూర్వ‌మైన ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్ సాధించిన ఈ క‌ప్ దెబ్బ‌కు భార‌త‌దేశం అంత‌టా క్రికెట్ ఫీవ‌ర్ ఆవ‌హించింది. అప్ప‌టి నుంచి నేటి దాకా ఎక్క‌డ చూసినా క్రికెట్టే. ఇవాళ ఈ దేశం క్రికెట్‌ను శ్వాసిస్తోంది. అదే జీవితంగా బ‌తుకుతోంది. 100 కోట్ల జ‌నాభాకు పైగా ఉన్న ఇండియా ఆట‌..పాట‌..మాట‌..న‌డ‌త అంతా క్రికెట్టే. అంత‌లా దానితో క‌నెక్ట్ అయింది. క‌పిల్ డెవిల్స్ సాధించిన ఈ ఘ‌న విజ‌యం నేటికీ చిర‌స్మ‌ర‌ణీయంగా ఉంది. ఆ త‌ర్వాత ఎం.ఎస్. ధోనీ సార‌థ్యంలో ఇండియా ప్ర‌పంచ క‌ప్ ను సాధించింది. అయినా ఆనాటి మ‌జాయే వేరు. క‌పిల్ మైదానంలోకి అడుగు పెడితే చాలు..ఫ్యాన్స్ పుల‌కించి పోయేవారు. ఎవ‌రి చేతిలో చూసినా రేడియోనే. విన‌సొంపైన కామెంట‌రీ కోసం చెవులు కోసుకునే వారు.

1983లో ఇంగ్లండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్‌లో ఇండియా క్రికెట్ జ‌ట్టుపై ఆశ‌లే లేవు. అండ‌ర్ డాగ్ జ‌ట్టుగా ప‌రిగ‌ణించ‌బ‌డింది. వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం లేదు. భార‌త జ‌ట్టు అంటేనే టెస్ట్ మ్యాచ్‌లకు పెట్టింది పేరు.  ఈ టోర్న‌మెంట్‌లో ఆడేకంటే ముందు ఇండియ‌న్ జ‌ట్టు కేవ‌లం 40 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం మాత్ర‌మే వున్న‌ది. టీమిండియా..క‌పిల్ సేన‌కు వ‌న్డే ఫార్మాట్ అంటే ఏమిటో, నియ‌మ నిబంధ‌న‌లు ఎలా వుంటాయో తెలియ‌దు. తెలిసింద‌ల్లా నెమ్మ‌దిగా ఆడ‌డ‌మే. ఓడిఐ ప‌ద్ధ‌తిలోనే ఆడాలి. లేక‌పోతే హెచ్చ‌రిక‌ల‌తో పాటు ఫైన్స్ కూడా ఉంటాయి. 29 మార్చి 1983లో విండీస్‌ను ఓడించింది. సునీల్ గ‌వాస్క‌ర్ 90 ప‌రుగులు చేయ‌గా, క‌పిల్ దేవ్ 72 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవ‌లం 38 బంతులే ఎదుర్కొన్నాడు. 47 ఓవ‌ర్ల‌లో 282 ప‌రుగులు చేసింది. విండీస్ జ‌ట్టులో రిచ‌ర్డ్స్ 64 ప‌రుగుల వ‌ద్ద అవుట‌య్యాడు. 9 వికెట్లు కోల్పోయి 225 ప‌రుగులు చేసింది. ర‌విశాస్త్రి 3 వికెట్లు తీశాడు. ఇండియా 27 ప‌రుగుల తేడాతో నెగ్గింది. ఇదే సీన్ ను భార‌త జ‌ట్టు రిపీట్ చేసింది.

య‌శ్‌పాల్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 89 ప‌రుగులు చేశాడు. 60 ఓవ‌ర్ల‌లో ఇండియా 262 ప‌రుగులు టార్గెట్ ఇచ్చింది. విండీస్ 228 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రోజ‌ర్ బిన్నీ, ర‌విశాస్త్రిలు చెరో మూడు వికెట్లు కూల్చారు. ఇండియా జింబాబ్వేతో పాటు ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైన‌ల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. 213 ప‌రుగుల‌కే ప‌రిమితం చేశారు. క‌పిల్‌దేవ్ మూడు వికెట్లు తీస్తే బిన్నీ, అమ‌ర్ నాథ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. మైదానంలోకి దిగిన ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. య‌శ్ పాల్ శ‌ర్మ 61 ప‌రుగులు చేయ‌గా, సందీప్ పాటిల్ 51 ప‌రుగులు చేసి గ‌ట్టెక్కించారు. దీంతో ఇండియా నేరుగా ఫైన‌ల్‌కు వెళ్లింది. తిరిగి ఈ టోర్న‌మెంట్‌లో విండీస్‌తో ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డింది ఇండియా. అప్ప‌టికే ప్ర‌పంచ‌మంతటా ఇండియాను అండ‌ర్ డాగ్ గానే చూశారు. విండీస్ గెలుస్తుంద‌ని ప్ర‌క‌టించేశారు.

ఇండియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 183 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఒక్క‌డే 38 ప‌రుగులు బిగ్ స్కోర్ చేశాడు. ఆ త‌ర్వాత టైటిల్ ఫేవ‌ర్ గా ఉన్న విండీస్ జ‌ట్టు 140 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 26 ప‌రుగులే ఇచ్చి మూడు కీల‌క వికెట్లు తీశాడు అమ‌ర్ నాథ్. బిన్నీ కూడా. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బిన్నీ ఎక్కువ వికెట్లు కూల్చాడు. మొత్తం మీద క‌పిల్‌దేవ్ సార‌థ్యంలోని ఇండియా క‌ప్పును ముద్దాడింది. కోట్లాది భార‌తీయుల గుండెల్ని ఏకం చేసింది. ఈ హ‌రీకేన్ త‌ర్వాత హైద‌రాబాద్ స్టార్ ..అజ్జూ భాయ్ ..రిస్టీ ప్లేయ‌ర్ సారథ్యంలో ఇండియా ఎన‌లేని విజ‌యాల‌ను ..గెలుపుల‌ను చేజిక్కించుకుంది. మ‌హోన్న‌త‌మైన ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్న ఈ సార‌థి అనూహ్యంగా ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల్లో ఇరుక్కుని ..త‌న కెరీర్‌ను ముగించాడు. కోహ్లి సార‌థ్యంలోని ఇండియా జ‌ట్టు ..ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ఎగ‌రేసుకు వ‌స్తుందో లేదో వేచి చూడాలి. 

కామెంట్‌లు