పాండ్యా పంచ్..చాహర్ అదుర్స్ - వారెవ్వా ముంబై
ఇదీ బౌలింగ్ అంటే. ఎలా వుంటుందంటే ..ఏం చెప్పాలి..మాటలు చాలవు..కేవలం చూడాల్సిందే. చూస్తే చిన్నోడు చాహర్ అత్యద్భుతమైన రీతిలో బంతులతో మెస్మరైజ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మట్టి కరిపించింది ముంబై ఇండియన్స్ జట్టు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ టోర్నమెంట్ లో జీవితకాలం గుర్తుంచు కోదగిన సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. చాకుల్లాంటి కుర్రాలు ..మెరికల్లాంటి బంతులు వేస్తుంటే..ఇంకో వైపు రిషబ్ పంత్..సంజూ శాంసన్..లాంటి యువ కెరటాలు తమ దైన శైలితో ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. బలౌర్లలో కొందరు..బ్యాటింగ్‌లో మరికొందరు ఇలా ఒకరికొకరు ప్రతిభాణ్వేషనలో పోటీ పడుతున్నారు. మొత్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులకు పసందైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. క్రికెట్ ఆటలో ఉన్న గమ్మత్తయిన మజాను ఆస్వాదించేలా చేస్తున్నారు.
ముంబయి ఇండియన్స్ విజయంతో మురిసి పోయింది. ఈ జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టి కృషితో రాణించారు. ఆల్ రౌండ్ సత్తా చాటారు. ఐపీఎల్ -12 లో ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేసింది. హర్దీక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తే..యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ బంతుల మాయాజాలం గట్టెక్కించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో 150 వికెట్లు తీసిన ఇండియన్ క్రికెటర్ గా అమిత్ మిశ్రా ఘనత సాధించడం కొసమెరుపు. చాహర్ ఒక్కో బంతిని వేస్తుంటే ఢిల్లీ జట్టు ఆటగాళ్లు డిఫెన్స్ కే పరిమితమయ్యారే తప్పా..ఏ కోశాన పరుగులు తీయలేక పోయారు. బంతులు మెలికల్లా తిరుగుతుంటే ..ఎక్కడ వచ్చి తాకుందేమోనని ఇబ్బంది పడ్డారు ఆటగాళ్లు.
కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చిన చాహర్ మూడు కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో 40 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై ముంబై ఘన విజయం సాధించింది. హార్దిక్ 15 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు సాధించాడు. కృనాల్ పాండ్య 26 బంతుల్లో 37 పరుగులు చేయగా..చివర్లో డికాక్ 27 బంతులు మాత్రమే ఆడి రెండు ఫోర్లు..రెండు సిక్సర్లతో 27 పరుగులు చేయడంతో ..మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై 168 పరుగులు చేసింది. చాహర్ తో పాటు బుమ్రా కూడా రాణించాడు. అతను 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు మైదానంలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా లు ధాటిగా ఆడారు.
ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్నట్టు అనిపించింది. ఈ సమయంలో ముంబై కెప్టెన్ యువ కెరటం చాహర్ ను రంగంలోకి దింపాడు. ఇంకేం ..సీన్ మారింది..14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. పరుగుల కోసం పాకులుడుతున్నా రాని పరిస్థితిని బౌలర్లు తీసుకు వచ్చారు. ధావన్, షాతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను పెవిలియన్ బాట పట్టించడంతో పతనం తప్పదని తేలింది. బాగా ఆడతాడనుకున్న మన్రో ను కృనాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రన్ రేట్ పెరగడం..వికెట్లు చకా చకా కోల్పోవడంతో ఇక ఓటమి పాలవ్వక తప్పలేదు ఢిల్లీ జట్టుకు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి