కేంద్రంలో కొలువుతీరేదెవ్వరో..అంతటా హంగ్ వైపే
నిన్నటి దాకా మోదీ మార్క్ ప్రభంజనం సృష్టిస్తే..ఇపుడు కమలనాథులు మెల మెల్లగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాదని జాతీయ స్థాయిలోని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలతో పాటు తటస్థులకు విపరీతమైన డిమాండ్ పెరగనుంది. ప్రభుత్వ ఏర్పాటులో వీరే కీలకం కానున్నట్టు స్పష్టమవుతోంది. ఈసారి నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే ..యూపీఏ మధ్య తేడా అన్నది స్వల్పంగా ఉండబోతోంది. ఇదే అదనుగా భావించిన ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎన్ని కోట్లు వస్తాయో ఊహల్లో తేలి యాడుతున్నారు. బిగ్ పార్టీస్ వైపు మొగ్గు కంటే ..తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందోననే దిశగా మంతనాలు సాగిస్తున్నారు. పవర్ చేతిలో వుంటే కరెన్సీ అదంతకు అదే వస్తుందని నేతలు నమ్ముతున్నారు. ఇప్పటి నుంచే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, అధినేతలు బరిలో ఉన్న తమ అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు.
బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా కొద్దిగా ఉన్నప్పటికీ సర్వేల సరళిని పరిశీలిస్తే మాత్రం భారీ తేడా ఉన్నట్టు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రంలో మరోసారి చక్రం తిప్పాలని ఆశలతో ఉన్న మోదీ అండ్ పార్టీ పునరాలోచనలో పడగా..ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పరితపిస్తున్న రాహుల్ గాంధీ ఆశలు ఆవిరై పోయేట్టుగా ఉన్నాయి. ఇంకో వైపు వారి కుటుంబం నుంచే కొత్తగా ఎంపీగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీ బరిలో ఉండడం తో రాజకీయ పరంగా..అధికార పరంగా ఏమైనా మార్పులు జరుగుతాయా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి యుపీఏ, ఎన్డీయే పరిధిలోకి రాకుండా ఉండేలా ..కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. అంచనాలు తారుమారైతే..ఒకవేళ అటు ఇటు జంపింగ్ చేయాల్సి వస్తే అన్నీ సర్దుకోవాలిగా. అందుకే రాబోయే పవర్ ను చేజిక్కించుకునేందుకు తంటాలు పడుతున్నాయి పార్టీలు.
ఐదేళ్ల కిందట 282 సీట్లతో విజయభేరి మోగించి సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి సగానికి పైగా సీట్లను కోల్పోనుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తొలిదశ పోలింగ్ ముగిశాక..ప్రీపోల్ సర్వే సంస్థలు సీఎస్‌డిఎస్, సి ఓటర్ లు పాపులారిటీ తగ్గిందంటూ అంచనా వేశాయి. మోదీ, రాహుల్ గాంధీల సారథ్యంలోని పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీల మీదే ఆధారపడనున్నారు. ఏది ఏమైనా వీరే కీలకం కానున్నారని తేలి పోయింది. ఎన్నికలు పూర్తయ్యాక చర్చలు జరపేందుకు ..వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేకంగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎక్కువ పోలింగ్ నమోదైతే మోడీకి అడ్వాంటేజ్ ఉండేది..కానీ అనుకున్న దానికంటే అత్యంత తక్కువగా నమోదు కావడం ఒకింత ఆందోళనకు గురి చేసింది కమళనాథుల్ని.
పోలింగ్ జరుగుతున్న చాలా చోట్ల బీజేపీ ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. ఓటర్లు మందకొడిగా స్పందించడం కూడా మరో కారణంగా తోస్తోంది. బీహార్, మహారాష్ట్రల్లోను అంతగా స్పందన లేదు. ఏప్రిల్ 12 లోపు అంచనా వేస్తే మోదీ ప్రభ 43.25 శాతానికి పడిపోవడం మరిత ఆందోళన కలిగిస్తోంది. న్యాయ్ పథకం, రాహుల్ సబ్జెక్టు ఇతర అంశాలను రాహుల్ ప్రజల్లోకి తీసుకెళ్లడం కొంచెం ప్లస్ పాయింట్ కాగా బీజేపీకి మైనస్ కాబోతోంది. ఇరు కూటములకు 150 నుండి 170 మధ్య రానున్నాయి. ఎన్‌డిఏలో బీజేపీ, శివసేన, జేడియూ, అకాళీదళ్ ఉండగా..యూపిఏలో కాంగ్రెస్ తో పాటు డిఎంకె..ఆర్డేడీ , ఎన్‌సీపీ, ఎస్‌సీ, జేడీఎస్ తదితర పార్టీలున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 30 మంది ఎంపీలు, ఒడిసాలో బిజూ జనతాదళ్ నుంచి 15 ఎంపీలు, వివిధ రాష్ట్రాల నుండి 30 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు తటస్థంగా ఉండొచ్చని అంచనా. మొత్తం మీద ఎవరు పవర్ లోకి ఎవరు వస్తారోనన్నది కాలమే తేలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి