రెవిన్యూ సరే ..విద్యా శాఖ మాటేమిటి..?
దేశంలోనే సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సెన్సేషనల్ నిర్ణయాలకు తెర తీశారు. దీంతో ఆయా శాఖల్లోని ఉద్యోగులు..సిబ్బందికి కంటి మీద కునుకే లేకుండా పోయింది. సీఎం ఎప్పుడు ..ఎవరి మీద పడతారో తెలియక లబోదిబోమంటున్నారు. పైకి బయట పడక పోయినా..ఆయా ఉద్యోగాల సంఘాల నేతలు గులాబీ బాస్ దగ్గరకు వెళ్లాంటేనే జడుసుకుంటున్నారు. దస్త్రానికో ధర నిర్ణయిస్తూ..ప్రజలను భూముల పేరుతో జలగల్లా ఇప్పటి దాకా పీడించుకుతిన్న రెవిన్యూ శాఖ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం. ఇటీవల జరిగిన ఎన్నికల సభల్లో ఏకంగా ప్రజల సాక్షిగా ఆయన ఆ శాఖ పనితీరు బాగా లేదని..ఐదేళ్ల పరిపాలనలో వేలాది మంది బాధితులు తమకు ఫిర్యాదు చేశారని ..దీంతో చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
అంతేకాకుండా భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన ఉద్యోగులు, సిబ్బంది ఇలా వసూళ్లకు, లంచాలకు తెగబడటం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది. 80 శాతానికి పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కావడంతో..ప్రత్యేకంగా సర్వే చేయించి మరీ నిర్ణయాన్ని ప్రకటించారు. అవినీతి ఆక్టోపస్ లా పేరుకు పోయిందని..దీనిని మొగ్గలోనే తుంచేయక పోతే..మొత్తం వ్యవస్థతో పాటు ప్రస్తుత సర్కార్‌కు చెడ్డ పేరు తీసుకు వచ్చేలా వుందని సీఎం అసాధారణ నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రజల సాక్షిగా వెల్లడించారు.
ముఖ్యంగా బాధితులు, పంటలు పండించే అన్నదాతలు ఎవరూ ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన పనిలేదని..దయచేసి రెండు నెలలు మాత్రమే ఆగండని..ఎలాంటి మార్పులు..చేర్పులు.. చేసుకోవద్దంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. లక్షకు మించి భూ సమస్యలు కొలువుతీరి ఉన్నాయని..ఏ భూములు ఎక్కడ ఉన్నాయో..ఎవరి పేరు మీద రాశారో ..వివరాలు లేని పరిస్థితి నెలకొంది. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా..జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్నా..పోనీ చదువుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇలా ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధి పొందాలంటే డబ్బులు సమర్పించు కోవాల్సిందే. లేకపోతే ఫైలు కదలదు..సారు సంతకం చేయరు. రెవిన్యూ శాఖలో పేరుకు పోయిన అవినీతిని తొలగించాలంటే ఇంకో అయిదేళ్లవుతుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
అటెండర్ నుంచి ఎమ్మార్వో, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్ దాకా ఫైలు కదలాలంటే చేతులు తడపాల్సిందే. ఈ అవినీతి..అక్రమాలను నిలువరించలేక చాలా మంది బాధితులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏకంగా రెవిన్యూ శాఖను మార్చేస్తున్నామని..ఇక నయా పైసా ఇచ్చు కోవాల్సిన అవసరం లేదని..చాలా సులభంగా అన్ని సమస్యలు పరిష్కరించేలా ధరణి వెబ్ సైట్ తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. రెవిన్యూ చట్టంలో మార్పులు చేయడం..శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయడం మినహా మరో మార్గం లేదంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆకస్మిక నిర్ణయంతో రెవిన్యూ ఉద్యోగులు, సంఘాలు, నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఊరుకోమంటూ ఆల్టిమేటం కూడా ఇచ్చారు. దీనిని పెద్దాయన తేలిగ్గా తీసుకున్నారు. మీరు లేకపోతే ప్రభుత్వం నడవదు అనే రీతిలో ..భ్రమల్లో ఉండి పోయారు. మీరు చేసే పనిని ఎవరైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా సహించే ప్రసక్తి లేదని..మార్పు తప్పదని సంకేతాలు ఇచ్చారు. కొందరు ఉద్యోగులు దారికి రాగా..మరికొందరు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖతో పాటు ఎక్కువగా అవినీతికి ఆస్కారం ఏర్పడిన విద్యా శాఖను సైతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తించారు. దీని తర్వాత దాని అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. అక్కడ కూడా లంచావతారులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఎవరు ఏం పనిచేస్తున్నారో తెలియడం లేదు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, టీచర్లు అధికార పార్టీకి ఓటు వేయలేదు. ఈ విషయాన్ని సీఎం సీరియస్ గానే తీసుకున్నారు. టీచర్లు, సంఘాల నేతలు పాఠాలు చెప్పకుండా ప్లాట్లు, చిట్టీల వ్యాపారం చేస్తున్నారని సాక్షాత్తు గులాబీ బాస్ ..తనను కలిసిన నేతలతో చెప్పడంతో అంతా నోరు మూసుకుని వెనుదిరిగారు. బ్లాక్ మెయిలింగ్‌కు దిగితే తాను సహించే ప్రసక్తి లేదని..ఇక ఇన్ని శాఖలతో అవసరం ఏముందని..అన్ని శాఖలను ఒకే శాఖలోకి మార్చితే బావుంటుందని ..ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని ఉన్నతాధికారులకు..సీఎస్‌ను ఆదేశించారు. మొత్తం మీద ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారోనని ఉద్యోగులు తెగ ఆందోళన చెందుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి