జేడీయూకు బంపర్ ఆఫర్
ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ మిత్రపక్షం జేడీయూను శాంత పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. జేడీయూని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ గత కొంత కాలంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కక పోవడం, ఎన్‌ఆర్‌సీ, రానున్న అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు వంటి అంశాలపై జేడీయూ, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీట్ల ఒప్పదంలో సింహ భాగం తామే పోటీ చేస్తామని, బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ తేల్చి చెప్పారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి విపక్షాలకు చేతులు కలిపేందుకు కూడా నితీష్ సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వెంటనే తేరుకున్న మోదీ, షా ద్వయం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. జేడీయూని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం. కాగా ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కేవలం ఒక్కరికే మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్.. ఒక్క పదవి తమకు అవసరం లేదని తిరస్కరించారు. దీంతో మోదీ తొలి మంత్రివర్గ విస్తరణలో జేడీయూకి చోటు దక్కలేదు. ఎన్డీయే అతిపెద్ద భాగస్వామ్య పక్షం శివసేన మంత్రి మండలి నుంచి వైదొలగడం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నితీష్ గళం విప్పడం వంటి ప్రభుత్వ వ్యతిరేక పరిణామాలు చకచక జరిగి పోయాయి. మరో వైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు గడువు దగ్గరప డుతుండంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. జేడీయూని మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు అంగీకరించింది. జేడీయులో ఇద్దరికీ చోటు దక్కనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి