మరాఠాలో పవార్ దే పవర్

నిన్నటి దాకా అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరాఠాలో చక్రం తిప్పడం చేస్తూనే ఉన్నారు. మొదటి నుంచీ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన ఈ నాయకుడు ఏది చేసినా అది సంచలనమే. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా శాఖల కేటాయింపు కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ శాఖ కావాలని పట్టుబట్టినా శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది. కాగా మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ వారికి ఇంకా శాఖలను కేటాయించని విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శరద్‌ పవార్‌ తో భేటీ అయ్యారు. శాఖల అప్పగింతపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన హోంమంత్రిత్వ శాఖను ఎన్సీపీ సీనియర్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు అప్పగించే యోజనలో ఉద్ధవ్‌ ఉన్నారని తెలిసింది.

అలాగే ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధిశాఖ, శుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలు, బాలాసాహెబ్‌ తోరట్‌కు రెవెన్యూ, కార్మిక, ఎక్సైజ్‌శాఖ దిలీప్‌ వాల్సే పాటిల్‌కు, ఆరోగ్య వర్షా గైక్వాడ్‌కు, సామాజిక న్యాయం ధనుంజయ్‌ మూండేకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ మేరకు శరద్‌ పవార్‌, ఉద్ధశ్‌ ఠాక్రే మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక శదర్‌ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి వారిని ఒప్పంచడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ను సైతం వెనక్కి రప్పిచడంలో శరద్‌ రచించిన వ్యూహం విజయవంతమైంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటులో శరద్‌ పవాద్‌కే ముఖ్య పాత్ర అని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సైతం అభిప్రాయపడ్డారు. దీంతో కీలక శాఖలను ఎన్సీపీకి అప్పగించేదుకు సైతం ఠాక్రే వెనుకాడట్లేదని తెలుస్తోంది. మరోవైపు శాఖల కేటాయింపులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కీలక శాఖలన్నీ శివసేన, ఎన్సీపీ దక్కేఅవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మంత్రులు ముందుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్‌లో చోటు దక్కక పోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతీ షిండే ఇప్పటికే ఆందోళలకు దిగారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!